Share News

అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్లు.. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి: రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Oct 05 , 2026 | 10:47 AM

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఇంద్ర పుష్కరిణి సందర్శించిన అనంతరం ఆలయ అధికారులు, అర్చకులతో ఆలయ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు.

అరసవల్లి ఆలయ అభివృద్ధికి రూ.55.74 కోట్లు.. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి: రామ్మోహన్ నాయుడు
Union Minister Ram Mohan Naidu

శ్రీకాకుళం, అక్టోబర్ 5: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు(సోమవారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఇంద్ర పుష్కరిణి సందర్శించిన అనంతరం ఆలయ అధికారులు, అర్చకులతో ఆలయ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్వదేశీ దర్శనం 2.0 కింద అరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెరావత్‌కు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో అరసవల్లి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని గత రెండేళ్లుగా చేసిన కృషికి ఇది ఒక మైలురాయిగా చెప్పుకొచ్చారు.


స్వదేశీ దర్శనం ప్రాజెక్ట్‌ను పూర్తి శాతం సంపూర్ణంగా వినియోగిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. రెండు సంవత్సరాలలోపే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే ఆలోచనతో కార్యాచరణ రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి దేశ, విదేశాల నుంచి భక్తుల తాకిడి పెరుగుతోందన్నారు. ప్రతి ఆదివారం 30 వేల మంది భక్తులతో దర్శనాలు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో భక్తులు ఎక్కువగా రావడానికి తగు సౌకర్యాలు కోసం ప్లాన్ చేస్తున్నామని అన్నారు.


గత రెండు సంవత్సరాలుగా రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని కేంద్ర మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఆలయాలపై మంచి ఆలోచనతో పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తోందని తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టడం చాలా సంతోషమన్నారు. రాష్ట్రంలో ఒక ప్రతిష్ఠాత్మకమైన ఆలయంగా తయారు చేసే నమ్మకం తమకు ఉందన్నారు. ఇప్పటికే ఇంద్ర పుష్కరిణికి రూ.4 కోట్లతో పనులు జరిపిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు కూడా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు.


ఇవి కూడా చదవండి...

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 11:12 AM