ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో వెలుగులోకి మరో షాకింగ్ విషయం..
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:37 AM
ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడిచేసిన తర్వాత విమానం ఇంజిన్లను షట్ డౌన్ చేసేందుకు యత్నించి ఉండవచ్చని ఇటలీ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా పేర్కొంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ దాడిచేసిన తర్వాత విమానం ఇంజిన్లను షట్ డౌన్ చేసేందుకు యత్నించి ఉండవచ్చని ఇటలీ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా పేర్కొంది. పైలట్ మచ్చార్‌పై దాడిచేసిన తర్వాత విమానం ఒక్క నిమిషంలోపే 16 వేల అడుగుల కిందకు దిగిందని, సౌదీ ఎడారిలో విమానాన్ని కూల్చేందుకు హమ్మామీ యత్నించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది.
అంతేకాకుండా విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆపే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చని వెల్లడించింది. ‘‘విమానం గాల్లో ఉండగా ప్యాసింజర్ క్యాబిన్‌లో ఎమర్జెన్సీ లైట్లు వెలిగినట్లు విమానంలో రికార్డయిన వీడియో ద్వారా తెలిసింది. సాధారణంగా విమానం నేలపై ఉన్నపుడు లేదా విమానాన్ని ఖాళీ చేస్తున్నపుడు ప్యాసింజర్లను గైడ్ చేయడానికి ఎమర్జెన్సీ లైట్లను వాడతారు. విమానం నడుస్తున్నపుడు అలాంటి లైట్లను యాక్టివేట్ చేయరు. బ్యాటరీ పవర్‌కు మెయిన్ ఎలక్ట్రికల్ పవర్ సప్లైను విమానం కోల్పోయినపుడు బోయింగ్ 737 విమానంలో ఎమర్జెన్సీ లైట్లు వెలుగుతాయి.
సాధారణంగా విమానం జనరేటర్లు లేదా ఇంజిన్లు షట్ డౌన్ అయినపుడు ఇది జరుగుతుంది. ఇంజిన్లకు ఇంధన సరఫరాను నియంత్రించే స్విచ్చులను కోపైలట్ హమ్మామీ.. రన్ పొజిషన్ నుంచి కటాఫ్ పొజిషన్‌కు మార్చాడా అన్నది తేలాల్సి ఉంది’’ అని బోయింగ్ 737కు చెందిన ఇద్దరు కెప్టెన్లు తమకు తెలిపారని కొరియర్ డెల్లా సెరా వెల్లడించింది. ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల వాంగ్మూలాలు, సాక్ష్యాలు, భద్రతా సిబ్బందికి విమాన సిబ్బంది సమర్పించిన నివేదికల ఆధారంగా తాము దర్యాప్తు చేశామని ఆ పత్రిక పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
యుద్ధ విరమణ కోసం భారత్ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి
రష్యా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్ ధ్వంసం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..