Share News

వైసీపీ అరాచకాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం

ABN , Publish Date - Oct 16 , 2026 | 07:20 PM

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పలు ప్రాంతాల్లో కూటమి నాయకులపై వైసీపీ నేతలు దాడులకు దిగడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  వైసీపీ అరాచకాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం
PVN Madhav

విజయవాడ, అక్టోబర్ 16: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో కూటమి నాయకులపై వైసీపీ నేతలు దాడులకు దిగడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో హింసాత్మక రాజకీయాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తొలి రోజు నామినేషన్ ఘట్టంపై వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కుళ్ళబొడిచిందని మాధవ్ మండిపడ్డారు.


శుక్రవారం పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ..' వైసీపీ అరాచకాలకు ప్రజలు బుద్ధి చెబుతారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, రాష్ట్రంలో కూటమి సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. శాంతియుత ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటాం. 2024 ప్రజా తీర్పును స్థానిక ఎన్నికల్లో పునరావృతం చేస్తాం. ఓటమి భయంతో తిరుపతి, పుంగనూరు, రాయచోటిలో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. మిథున్ రెడ్డి వాహనంతో కార్యకర్తలను ఢీకొట్టేలా వేగంగా వెళ్లడం, అడ్డుకున్న వారిపై దాడులకు ప్రయత్నించడం వంటి ఘటనలు ఆందోళనకరం' అని మాధవ్ అన్నారు.


తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు మహిళా అభ్యర్థుల నామినేషన్లకు ఆటంకం కలిగించారని మాధవ్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించదనే భయంతోనే ప్రతిపక్షం భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ధర్మవరంలో బీజేపీ శ్రేణులపై వైసీపీ తీరుపై మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన హత్యా రాజకీయాలు, ప్రస్తుత అరాచకాలకు ప్రజలు మద్దతు ఇవ్వరని ఆయన స్పష్టం. హింసకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతియుత ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడతామని మాధవ్ వెల్లడించారు.


అన్ని స్థానాల్లో ఐక్యంగా పనిచేస్తూ అఖండ మెజారిటీ సాధిస్తామని, 2024 ఎన్నికల ప్రజా తీర్పును పునరావృతం చేస్తామని బీజేపీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, హింసకు తావులేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోవాలని మాధవ్ పిలుపునిచ్చారు. చౌకబారు రాజకీయ ఎత్తుగడలకు పాల్పడితే సహించేది లేదని, ప్రజలను భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు మానుకోవాలని పీవీఎన్ మాధవ్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

పుంగనూరును శ్మశానంగా మార్చాలని పెద్దిరెడ్డి కుటుంబం కుట్ర చేస్తోంది: ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి

వైసీపీ విధానాలతో రాష్ట్రానికి నష్టం: ఎమ్మెల్యే కోటంరెడ్డి

పుంగనూరు దాడులపై వైసీపీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వార్నింగ్

Updated Date - Oct 16 , 2026 | 07:33 PM