వైసీపీ విధానాలతో రాష్ట్రానికి నష్టం: ఎమ్మెల్యే కోటంరెడ్డి
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:19 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైసీపీ తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నెల్లూరు, అక్టోబర్ 16: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత జగన్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని, దీంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను రెండేళ్లపాటు వాయిదా వేసిందని.. ఇప్పుడు కూడా ఎన్నికలకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పుంగనూరు, రాయచోటి, తిరుపతి ప్రాంతాల్లో నామినేషన్ల తొలిరోజే వైసీపీ శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. మిథున్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, రాజకీయాల్లో ఇలాంటి దూకుడు ధోరణులు సరికాదని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఎన్నికలను ఎదుర్కోవాలని, అక్కడే ఎవరి బలమెంతో తేలుతుందని వ్యాఖ్యానించారు.
టీడీపీ కార్యకర్తలు భయపడొద్దు.. అండగా ఉంటా..
నెల్లూరులో ఐటీడీపీకి చెందిన వ్యక్తులను వైసీపీ నేతలు బెదిరించారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ కూటమి మేయర్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 72 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. నెల్లూరులో చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడితే టీడీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.