ఇదే కొనసాగితే భవిష్యత్తులో అద్భుతంగా ఏపీ చిత్రపఠం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ABN , Publish Date - Mar 19 , 2026 | 03:53 PM
రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇదే పరిస్థితి మరో 15 ఏళ్లు కొనసాగితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చిత్రపటం అద్భుతంగా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
నెల్లూరు, మార్చి 19: కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(MLA Kotamreddy Sridhar Reddy) వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసినట్లు ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు.
ఈ వయస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పని చేస్తున్నారని కోటంరెడ్డి ప్రశంసించారు. ఇదే పరిస్థితి మరో 15 ఏళ్లు కొనసాగితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చిత్రపటం అద్భుతంగా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. నాడు ‘కంప్యూటర్లు కూడు పెడతాయా?’ అని విమర్శించారని... నేడు చంద్రబాబు ముందుచూపు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది కంప్యూటర్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబును జైలులో వేసినప్పుడు కూడా ఆ కంప్యూటర్ రంగ ఉద్యోగులంతా ఆయనకు అండగా నిలిచారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా లక్షల ఉద్యోగాలు, ఇంకోవైపు క్వాంటమ్ వ్యాలీతో చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. సామాన్య రాజకీయ నేత రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే ఆలోచిస్తే.. నిజమైన రాజనీతిజ్ఞుడు మాత్రం భవిష్యత్తుతరాల గురించి ఆలోచన చేస్తాడని అన్నారు. చంద్రబాబు నాయుడు రాజనీతిజ్ఞుడని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
అకాల వర్షాలు.. రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు
ఉగాది ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలి: మంత్రి కొల్లురవీంద్ర
Read Latest AP News And Telugu News