Share News

అకాల వర్షాలు.. రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:47 PM

ఏపీలో అకాల వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

అకాల వర్షాలు.. రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు
Minister Atchannaidu

అమరావతి, మార్చి 19: రాష్ట్రంలో రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు(గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జ్ కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తదితర ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.


ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని మంత్రి తెలిపారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


రైతులకు మంత్రి సూచనలివే..

  • పండిన పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలి.

  • వడగళ్ల వాన, ఈదురుగాలుల సమయంలో పొలాల్లో ఉండకూడదు.

  • వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి.

  • పండ్ల తోటలకు రక్షణ చర్యలు తీసుకోవాలి.

  • పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడకూడదు, సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలి.

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి..

ప్రతి ఏడాది ఉగాది రోజున జాబ్ క్యాలెండర్: సీఎం చంద్రబాబు

ప్రపంచాన్ని శాసించే దిశగా భారత్: పీవీఎన్ మాధవ్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 03:03 PM