‘నన్ను ప్రశ్నించండి’.. కొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శ్రీకారం
ABN , Publish Date - May 26 , 2026 | 11:14 AM
నెల్లూరు రూరల్లో ‘నన్ను ప్రశ్నించండి’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతుడు కాదని.. ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు.
నెల్లూరు, మే 26: నెల్లూరు రూరల్లో ‘నన్ను ప్రశ్నించండి’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతుడు కాదని.. ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు. ‘యువతల్లో ప్రశ్నించే తత్వం రావాలని నిర్ణయించుకున్నా. నా ద్వారానే రాష్ట్ర, దేశ వ్యాప్త ఆలోచన రావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ డీలిమిటేషన్లో పొరపాట్లు జరిగాయని తాను జోక్యం చేసుకోలేదని.. నెల్లూరు డీలిమిటేషన్‌పై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు.
నెల్లూరు రూరల్లో అభివృద్ధి జరగని ప్రాంతాల్లో సిగ్గుతో తలదించుకొని స్థానిక ప్రజలను క్షమాపణలు కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ‘నన్ను ప్రశ్నించండి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కారణమైన ముగ్గురికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రశ్నించే తత్వాన్ని ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని తెలిపారు. యువత శ్రీశ్రీ, వివేకానందలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలన్నారు. నెల్లూరు డీలిమిటేషన్‌పై వైసీపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు డీలిమిటేషన్‌పై పత్రికా సమావేశంలోనే నెల్లూరు కమిషనర్‌కు కాల్ చేసి తన అభ్యంతరాలను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.
నెల్లూరు డీలిమిటేషన్ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న విషయాన్ని పూర్తిగా అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. ‘నా అభిప్రాయం, నా కుటుంబ సభ్యుల అభిప్రాయం ప్రకారం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పోటీలో ఉంటారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మా సొంతం కాదు.. మేమే పోటీ చేయాలన్న రూల్ లేదు. మాకు కాదు మరొకరికి ఇస్తామంటే మేము కచ్చితంగా స్వాగతిస్తాం’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
రాజమండ్రి: గోదావరి జలాల కాలుష్యంపై పవన్ కల్యాణ్ దృష్టి
Read Latest AP News And Telugu News