Share News

పంచాయతీ ఎన్నికలపై నారా లోకేశ్ టెలీకాన్ఫరెన్స్.. నేతలకు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:45 AM

ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలి విడత ఎన్నికల్లో విజయం సాధించామని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. మిగతా ఎన్నికల్లోనూ విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు.

పంచాయతీ ఎన్నికలపై నారా లోకేశ్ టెలీకాన్ఫరెన్స్.. నేతలకు కీలక ఆదేశాలు
nara lokesh panchayat election

అమరావతి, నవంబరు 27: ఏపీలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ పార్టీ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం.. పంచాయతీ ఎన్నికల వరకు కొనసాగుతోందంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. తొలి విడత ఎన్నికల్లో విజయం సాధించామని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. జరగబోయే రెండు, మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలని సూచించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, జరగబోయే రెండు, మూడు విడతల పంచాయతీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించి, పలు సూచనలు జారీ చేశారు.


‘మనకు బలం ఉందని రిలాక్స్ కావద్దు. ఎన్నికను ఎన్నికగానే చూడాలి... చిన్నదైనా... పెద్దదైనా ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకోవాలి. పోలింగ్ ఎంత ఎక్కువ జరిగితే మన మెజారిటీలు అంత ఎక్కువ పెరుగుతాయి. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో ఎంత కష్టపడ్డామో పంచాయతీ ఎన్నికల్లోనూ అంత కంటే ఎక్కువ కష్టపడి పని చేయాలి. జనసేన-బీజేపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. సీఎం చంద్రబాబు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉన్నారు.


ఎన్నికలు లేని నియోజకవర్గాలకు చెందిన నేతలు కూడా పంచాయతీ ఎన్నికల్లో అవసరమైన నియోజకవర్గాల్లో సేవలందించాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి. బలహీనంగా ఉన్న చోట గెలవాలి... బలంగా ఉన్న చోట మరింత మెజారిటీ సాధించాలి. వరుస ఓటములతో గొడ్డలి పార్టీ ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్తోంది. దాంతో ఎన్నికల్లో గొడ్డలి పార్టీ నేతలు హింసకు పాల్పడుతున్నారు. గొడ్డలి పార్టీ చేసే దాడులు, కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని లోకేశ్ సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 09:45 AM