ఏపీని వణికిస్తున్న మురసు తుపాను.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 09:07 AM
మురసు తుపాను నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, భారీ వృక్షాలు నేలకొరగడం, లోతట్టు ప్రాంతాలు జలమయమవడం లాంటి సంఘటనల మేరకు పలు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
అమరావతి, నవంబర్ 3: రాష్ట్రవ్యాప్తంగా మురసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. కాగా.. ఈ రోజే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తుండగా.. వర్షం కారణంగా పలు చోట్ల కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందని అధికారులు వెల్లడించారు.
పశ్చిమగోదావరి: జిల్లాలోని నరసాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో నరసాపురం-సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఇప్పటికే పేరుపాలెం బీచ్‌ను మూసివేసినట్లు వారు తెలిపారు.
ఉమ్మడి ప్రకాశం: ఉమ్మడి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపోగా.. విద్యుత్ స్తంభాలు రోడ్లకు అడ్డంగా నేలకొరిగాయి. జిల్లాల్లోని కొత్తపట్నం, పాకాల, ఉలవపాడు, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఏలూరు: ఏలురులో తెల్లవారు నుంచి భారీగా వర్షం కురుస్తుంది. ఆగకుండా కురుస్తున్న ఈ కుండపోత వర్షం కారణంగా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను ప్రభావం తగ్గే వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
విజయవాడ: జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా.. విజయవాడలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోలేదు. దీంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభవుతుందని అధికారులు వెల్లడించారు.
నెల్లూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా పొదలకూరు-సంగం రోడ్డులో ఓ భారీ వృక్షం కూలిపోయింది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా.. సోమశిల డ్యామ్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం రావట్లేదని అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వీకెండ్ పార్టీ కేసులో.. 7కు చేరిన గంజాయి పాజిటివ్‌లు
అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News