Share News

బీసీ కోటాపై సుప్రీం తీర్పు రాగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌: చంద్రబాబు

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:18 AM

స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా.. ప్రజల్లో సానుకూలత ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయాలి. ఈ బాధ్యత ఇన్‌చార్జి మంత్రులు తీసుకోవాలి.

బీసీ కోటాపై సుప్రీం తీర్పు రాగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌: చంద్రబాబు

  • బీసీ కోటాపై సుప్రీం తీర్పు రాగానే షెడ్యూల్‌: చంద్రబాబు

  • వచ్చేవారంలో కోర్టు నిర్ణయం రావచ్చు

  • అది కూడా నో అంటే పార్టీపరంగా రిజర్వేషన్లు

  • తీర్పు వచ్చాక 2-3 వారాల గడువుండదు

  • ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే ఎన్నికలకు వెళ్తాం

  • అందరూ సిద్ధంగా ఉండాల్సిందే..

  • ఏ పార్టీకి ఎంత శాతమన్న లెక్కలు వద్దు

  • ఎవరికి ఎక్కడ బలముందో చూసి పోటీ చేద్దాం

  • అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదే

  • మిత్రపక్షాలను సమన్వయం చేసుకోవాలి

  • ఇబ్బందులుంటే పల్లా, నిమ్మల దృష్టికి తీసుకెళ్లండి

  • 4-5 రోజుల తర్వాత నేనూ అందుబాటులోకి

  • టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి జూమ్‌ కాన్ఫరెన్స్‌

స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా.. ప్రజల్లో సానుకూలత ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయాలి. ఈ బాధ్యత ఇన్‌చార్జి మంత్రులు తీసుకోవాలి. మీరు పంపే జాబితాపై రాష్ట్ర స్థాయిలో కూడా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఖరారు చేస్తాం. తేడా వస్తే ఇన్‌చార్జి మంత్రులనే బాధ్యులను చేస్తాం.

-సీఎం చంద్రబాబు


అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీ కోటాపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిందని, దీనిపై నిర్ణయం రాగానే ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలిపారు. శనివారం టీడీపీ నేతలు, పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జి మంత్రులతో సీఎం జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా ఆమోదించని పక్షంలో పార్టీపరంగా ఇస్తామని తేల్చిచెప్పారు. వైసీపీ హయాంలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లలేదని, హైకోర్టు కొట్టివేసిన వెంటనే కోటాను కుదించేశారని, పార్టీపరంగా కూడా వైసీపీ న్యాయం చేయలేదని అన్నారు. సుప్రీంకోర్టులో వచ్చే వారంలో నిర్ణయం వస్తుందని భావిస్తున్నామని, అది వచ్చిన వెంటనే ఎన్నికలకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తొలి దశలో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని.. టీడీపీ నేతలు, శ్రేణులు అప్రమత్తంగా ఉండి.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టిపెట్టాలని పిలుపిచ్చారు. తీర్పు వచ్చాక 2, 3 వారాలు ఆగి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ఒకరిద్దరు మంత్రులతో పాటు కొందరు జిల్లా అధ్యక్షులు ప్రస్తావించగా.. సీఎం సీరియస్‌ అయ్యారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఇంకా సిద్ధంగా లేమంటే ఏమని అర్థం చేసుకోవాలని నిలదీశారు.


మనమే సర్దుకుపోవాలి:

కూటమి పార్టీల మధ్య పొత్తు గురించీ సీఎం ప్రస్తావించారు. ‘ఏ పార్టీకి ఎంత శాతం అన్న లెక్కలు కాకుండా.. ఎవరికి ఎక్కడ బలం ఉందో పరిశీలించి అక్కడ వారికి స్ధానాలు కేటాయించే విధంగా ముందుకు వెళ్లాలి. గెలుపే ధ్యేయంగా కూటమి పార్టీలు ముందుకు వెళ్లాలి. ప్రధాన పక్షం టీడీపీ కావడంతో సర్దుకుపోవలసిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని తేల్చిచెప్పారు. గెలిచే అభ్యర్థులనే ఎంపిక చేయాలని, అయితేవారికి ప్రజామోదం కూడా ఉండాలని సీఎం సూచించారు. కూటమిలోని మిగతా పక్షాలతో సమన్వయం చేసుకోవలసిన బాధ్యత జిల్లా స్థాయి సమన్వయ కమిటీదని తెలిపారు. నియోజకవర్గాల స్థాయిలో కూడా కమిటీలను నియమించాలన్నారు. సమన్వయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. తాను కూడా 4-5 రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 03:19 AM