కర్నూలు జిల్లాలో హృదయవిదారక ఘటన.. తల్లి మృతదేహం వద్దే..
ABN , Publish Date - Nov 08 , 2026 | 06:03 PM
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా.. ఆమె కుమారుడు రాత్రంతా మృతదేహం వద్దే ఏడుస్తూ సొమ్మసిల్లిపోయాడు.
కర్నూలు, నవంబర్ 8: జిల్లాలోని వెంకటరమణ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కుమారుడు తల్లి మృతదేహం వద్దే రాత్రంతా ఏడుస్తూ సొమ్మసిల్లిపోయాడు. ఈ విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే..
పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఆదోనికి చెందిన స్వాతికి హైదరాబాద్‌కు చెందిన గణేశ్ అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కుమారుడు శ్రీయాన్ ఉన్నాడు. కాగా.. కుటుంబ కలహల నేపథ్యంలో స్వాతి తన భర్తకు ఏడాది నుంచి దూరంగా ఉంటూ.. పుట్టింట్లో ఉంటున్నారు. శ్రీయాన్ కూడా తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ మేరకు నిన్న సాయంత్రం స్వాతి తల్లి.. తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. స్వాతి తన బెడ్‌రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. స్వాతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. కాగా.. ఆత్మహత్యకు ఉపయోగించిన స్టూల్‌పైనే .. చిన్నారి శ్రీయాన్ స్పృహ కోల్పోయి కనిపించాడు. ముందుగా బాబు కూడా మరణించి ఉంటాడని భావించిన పోలీసులు.. చిన్నారిని గట్టిగా తట్టగా శ్రీయాన్ ఏడవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాత్రంతా తల్లి కోసం ఏడుస్తూ.. శ్రీయాన్ స్టూల్‌పైనే సొమ్మసిల్లిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఒంటరితనాన్ని భరించలేకనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్వాతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు
ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు
పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News