యలహంక ఆస్తి వివాదం.. కుమార్తె వివాహంపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:38 AM
బెంగళూరు యలహంకలోని ఆస్తి విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి, అక్టోబర్ 31: బెంగళూరు యలహంకలోని ఆస్తి విషయంలో వైసీసీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి వివాహాన్ని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని భావించారు. అయితే ఆ ఇళ్లు తనదే అంటూ జగన్ వాదిస్తుండటంతో రగడ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కుమార్తె వివాహానికి సంబంధించి ‘ఎక్స్’ వేదికగా షర్మిలా రెడ్డి కీలక ప్రకటన చేశారు.
షర్మిలా రెడ్డి పోస్ట్
‘నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం. నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న వైఎస్‌ఆర్ తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని... కానీ తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాదరహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం’ అంటూ ఎక్స్‌లో వైఎస్ షర్మిలా రెడ్డి పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
మరికొద్ది రోజుల్లో గగన్‌యాన్ D1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి
కదిరి మున్సిపల్ ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు.. ఐదుగురి అరెస్ట్
Read Latest AP News And Telugu News