Share News

వేడినీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. వాస్తవాలేంటో తెలుసుకుందామా..

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:13 AM

గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలను నివారించవచ్చని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా.. మరి ఇందులో నిజం ఎంత? అపోహ ఎంత?

వేడినీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. వాస్తవాలేంటో తెలుసుకుందామా..
myths about health tips

ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న జీవన విధానంతో ఆరోగ్యసమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మంది వయసుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడుతుండడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలనుకునే వారు చేసే మొదటి పని.. చిట్కాలు పాటించడం. ఉదాహరణకు ప్రతిరోజు ఉదయం వేడినీళ్లు తాగడం, నిమ్మరసం తీసుకోవడం, సబ్జా గింజలు తీసుకోవడం.. ఇలాంటివి చాలా చేస్తాం. మరి ఈ చిట్కాలు నిజంగానే పని చేస్తాయా అన్న అనుమానం, అపోహలు చాలా మందిలో ఉంటాయి. మరి ఇందులో వాస్తవాలు ఏంటో తెలుసుకుందామా..


గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలను నివారించవచ్చని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా.. మరి ఇందులో నిజం ఎంత? అపోహ ఎంత?

1. వేడి నీళ్లు తాగితే నిజంగానే బరువు తగ్గుతారా..

బరువు తగ్గడానికి.. కొంతమంది ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున వేడినీళ్లు తాగుతుంటారు. కానీ.. ఇందులో వాస్తవం చాలా తక్కువ. వేడినీళ్లు తాగడం ద్వారా బరువు కోల్పోతారనడానికి శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు. వేడినీళ్లు తీసుకోవడంతో పాటు.. శారీరక శ్రమ చేయడం, సరైన వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, సమతుల ఆహారం తీసుకోవడం లాంటివి అలవాటు చేసుకోవాలి.


2. మరీ వేడినీళ్లు తాగకూడదు.

చాలా మంది వేడి నీళ్లు తాగాలి అంటే.. మరీ వేడిగా ఉన్నప్పుడే తాగుతుంటారు. వేడిగా ఉన్నప్పుడే నీళ్లను తాగడం వల్ల గొంతు నుంచి ఆహారవాహిక వరకు గల సున్నిత కణజాలాలు దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం పాటించే ఈ చిట్కాలే.. అనారోగ్యానికి దారి తీస్తాయి. మరీ వేడినీళ్లను తీసుకోవడం కంటే.. గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది.


3. అతి ఎప్పుడూ అనర్థమే

అతిగా తింటే ఆహారం కూడా విషంలా పనిచేస్తుందంటారు. అలాగే నీళ్లు కూడా. శరీరానికి సరిపోయేలా నీళ్లు తాగడం మంచిదే. కానీ మంచి చేస్తుంది కాదా అని.. అతిగా నీళ్లను తీసుకోకూడదు. అధికంగా నీళ్లను తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. రోజంతా నీళ్లను తీసుకోవచ్చు కానీ.. తీసుకున్నప్పుడల్లా కొద్దికొద్ది పరిమాణంలో తీసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ పరిమాణంలో నీళ్లను తాగడం వల్ల శరీరంలోని విలువైన ఖనిజాలు, పోషకాలను కోల్పోయే ప్రమాదం ఉంది. గుండె, మూత్రసంబంధ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సూచనల ప్రకారం నీళ్లను తాగడం శ్రేయస్కరం.


4. నీళ్లు తాగడం ముఖ్యం.. ఎప్పుడు, ఎలా అన్నది ముఖ్యం కాదు

రోజు ఉదయం నీళ్లు తాగడానికి కూడా కొంతమంది నియమాలు చెబుతుంటారు. బ్రష్ చేయకముందే తాగాలి.. ఖాళీ కడుపుతోనే తాగాలి.. వేడినీళ్లే తాగాలి.. నిర్దిష్ట పరిమాణంలోనే తాగాలి అని. శరీరానికి అవసరమైన నీళ్లు తీసుకోవడం ముఖ్యం కానీ.. ఎప్పుడు, ఎలా అనేదాని మీద ఎక్కువ దృష్టి పెట్టకండి. డీ హైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు శరీరానికి సరిపడే నీటిని అందించాలి. వేడినీళ్లు తాగాలి అనుకునేవారు గోరువెచ్చగా తీసుకోండి.. వీలుకాదు అనుకునేవారు సాధారణ నీటినే తాగవచ్చు.


5. వేడినీళ్లు తాగడం వల్ల నిజంగానే మలబద్దకం పోతుందా..

మలబద్దకం సమస్యతో బాధపడేవారు.. వేడినీళ్లు తాగడం వల్ల సమస్యను నివారించవచ్చని చాలా మంది చెబుతుంటారు. కానీ.. అందులో వాస్తవం కొంతే. ఆహారం జీర్ణం అవ్వడానికి సరిపడా నీళ్లను శరీరానికి అందించాలి. జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్‌ల కోసం.. ఆహారంలో పీచుపదార్థాలను, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. అంతేకానీ.. వేడినీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని, దానితో మలబద్దక సమస్యకు చెక్ పెట్టొచ్చు అని చెప్పలేం.


7. యాసిడిటీ ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

వేడినీళ్లు తాగడం శరీరానికి మంచిదే. కానీ అందరి శరీరాలు ఒకేలా స్పందిస్తాయని చెప్పలేం. వేడినీళ్లు తాగడం వల్ల కొంతమందికి సౌకర్యంగా అనిపించినా.. మరికొంతమందిలో వికారం, కడుపులో మంట, ఆహారం మింగడంలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నవారు.. సాధారణ నీటిని తాగడం మంచిది. లేదంటే డాక్టర్‌ను సంప్రదించి.. ఆయన సూచనలు పాటించడం ఉత్తమం.

Updated Date - Oct 31 , 2026 | 09:42 AM