Share News

మీకు అధికారం కావాల్సింది.. అందుకేనా?: జగన్‌కు దేవినేని ఉమా సూటి ప్రశ్న

ABN , Publish Date - Apr 09 , 2026 | 09:09 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాహేశ్వరరావు మరోసారి నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పరదాలు కట్టుకుని తిరిగారని.. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదంటూ జగన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

మీకు అధికారం కావాల్సింది.. అందుకేనా?: జగన్‌కు దేవినేని ఉమా సూటి ప్రశ్న
TDP Leader Devineni Uma

విజయవాడ, ఏప్రిల్ 09: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం విజయవాడలో దేవినేని ఉమామహేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పరదాలు కట్టుకుని తిరిగారని.. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదంటూ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఐదేళ్లు పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించరంటూ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. మళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్నారని మండిపడ్డారు.


ప్రజా వేదిక విధ్వంసంతో మొదలైన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌కు మంచి నీరు ఇవ్వడానికి కూడా చేతులు రాలేదంటూ జగన్‌ తీరును ఎండగట్టారు. ఐదేళ్ల విధ్వంస పాలనలో అడ్డగోలుగా చేసిన అవినీతి బయటకు తీయటానికే సగం మంది అధికారులకు సరిపోతుందని వ్యంగ్యంగా అన్నారు. లిక్కర్ దోపిడీలో రూ. వేల కోట్ల దోపిడి కారణంగా మీతో కలిసి పని చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు.


పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లు సైతం ఆపేశారని గుర్తు చేశారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గెజిట్ నోట్ విడుదలైతే తట్టుకోలేక రాజధానిపై విషం చిమ్ముతున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయని ఈ సందర్భంగా దేవినేని ఉమా గుర్తు చేశారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, గండికోట ద్వారా రాయలసీమ చివరి ప్రాంతంలోని భూములకు సైతం నీళ్లు వెళుతుంటే ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేక పోతున్నారంటూ వైసీపీ నేతల వైఖరిపై నిప్పులు చెరిగారు.


హైదరాబాదులో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్లు నిర్మిస్తుంటే విషం చిమ్మిన వారే.. వైసీపీగా రూపాంతరం చెంది నేడు అమరావతిపై అక్కసు వెళ్ళగక్కుతున్నారని వివరించారు. ఈటీవీ, టీవీ 5, ఏబీఎన్‌లపై ఐదేళ్లు వేధింపులకు పాల్పడి.. అధికారం కోల్పోయినా విషం చిమ్మడం మాత్రం మానలేదంటూ జగన్‌తోపాటు ఆ పార్టీ నేతల తీరును విమర్శించారు. మీకు అధికారం కావాల్సింది.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడానికేనా? అంటూ వైఎస్ జగన్‌కు దేవినేని ఉమా చురకలంటించారు.


మళ్లీ అధికారంలోకి రావడం అనేది కల్లా.. ఇకనైనా ఉత్తర కుమార ప్రగల్బాలు మానండంటూ వైసీపీ నేతలకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్మించిన భవనాల్లోనే ఐదేళ్లు పరిపాలన చేశారని వైసీపీ నేతలకు గుర్తు చేశారు. మావిగన్ పేరుతో రెచ్చగొట్టాలనుకున్న వైసీపీ వాళ్లకు సీఆర్డీఏ పరిధి తెలుసా? అంటూ దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జీవన్ రెడ్డి విషయంలో అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సింది: జగ్గారెడ్డి

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 09:23 PM