Share News

వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావ్ సవాల్.. గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:50 PM

స్థానిక జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమా? అని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ సవాల్ చేశారు.

వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావ్ సవాల్.. గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా!

గన్నవరం, నవంబర్12: స్థానిక జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమా? అని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ సవాల్ చేశారు. నువ్వే నేరుగా టీడీపీ అభ్యర్థిపై జడ్పీటీసీగా పోటీకి దిగాలని సదరు మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. ఈ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. రాజకీయాలు కూడా వదిలేస్తానని స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల్లో గన్నవరం జడ్పీటీసీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ స్థానిక నేత వల్లభనేని వంశీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు.


గురువారం గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడారంటూ వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. టీడీపీలో గెలిచి.. వైసీపీలోకి దూకిన నువ్వా నీతులు చెప్పేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం వైసీపీ ఇన్‌ఛార్జి పదవి కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భార్యను దూషించిన చరిత్ర నీదంటూ నిప్పులు చెరిగారు.


మొన్న ప్రజలు నీకు బుద్ది చెప్పి ‌ఇంట్లో కూర్చోబెట్టారని వంశీకి ఎమ్మెల్యే వెంకట్రావ్ చురకలంటించారు. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న నువ్వు ఇప్పుడు ఒక్క గెలుపుతో రంకెలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు గెలిచినందుకు సంబరాలు అంటున్నావని తెలిపారు. మొత్తంగా గన్నవరం నియోజకవర్గంలో చూస్తే కూటమికే ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని వివరించారు.


మీ లాగా తాను డబ్బులు ఉ‌న్నవారికి సీట్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. బూత్ ఏజెంట్ సతీమణికి ఎంపీపీగా అవకాశం ఇచ్చానని పేర్కొన్నారు. అలాగే నగదు లేని నలుగురిని ఎంపీపీలు చేశానని చెప్పారు. తాను ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని... తన సొంత డబ్బునే ఖర్చు పెడుతున్నానని వివరించారు. మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఉంటూ.. ఐదు నెలలకి‌ ఒకసారి గన్నవరం నియోజకవర్గానికి వచ్చే వారని అన్నారు. తనపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది యూట్యూబర్లు ఫోన్ పేలు, డైమండ్ రింగ్‌లు తీసుకుంటున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్ చేసి కోట్ల రూపాయిలు దోచిన కంట్రిబ్యూటర్లు‌ కూడా ఉన్నారని చెప్పారు.


తప్పు చేయకుండా తన ఆత్మగౌరవం దెబ్బ తీస్తే చూస్తూ ఊరుకోనంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ వార్నింగ్ ఇచ్చారు. గన్నవరంలో జడ్పీటీసీ ఓటమిపై అధిష్టానం తనపై చర్యలు అంటూ రాస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదు, కుట్రలు చేయలేదు, దందాలు‌ చేయలేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని ఈ సందర్భంగా మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు.


తాను ప్రజల మనసు గెలుచుకుని ఈ స్థాయికి వచ్చానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. అయితే గన్నవరంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు, చర్చలు తనకు బాధ కలిగించాయని అన్నారు. తనకు సంస్కారం తెలుసు కాబట్టి కొన్ని హద్దుల్లో మాట్లాడుతున్నానని కుండ బద్ధలు కొట్టారు. తన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు సొంత డబ్బుతో చేశానని గుర్తు చేశారు. తనకు అవమానాలు, విమర్శలు కొత్త కాదని అన్నారు.


దశాబ్ద ‌కాలంగా తాను గన్నవరంలో ఏం చేశానో అభిమానులు, కార్యకర్తలందరికీ తెలుసునని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. దేనికైనా పద్దతులు ఉంటాయని.. ఎవడూ పడితే వాడు ఏదోకటి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గన్నవరం‌లో 63 ఓట్లతో‌ బీజేపీ జడ్పీటీసీ సభ్యులు ఓడిపోతే అవతల పక్షం పొంగిపోతుందని ఆరోపించారు. పొత్తుల కారణంగా మిత్ర ధర్మం వల్ల యాభై శాతం సీట్లు బీజేపీకీ కేటాయించామన్నారు.


కుమారస్వామి ఓడిపోవడం తనకు కూడా చాలా బాధ కలిగించిందని ఎమ్మెల్యే వెంకట్రావ్ చెప్పారు. ఆ రోజు కౌంటింగ్‌లో అనేక అక్రమాలు జరిగాయని విమర్శించారు. చెల్లని ఓట్లు పరిశీలించ లేదని.. గందరగోళంగా చేశారని తమ వాళ్లు చెప్పారని తెలిపారు. ఆ రోజు తులసీ మోహన్ మాత్రమే లోపల ఉన్నారని గుర్తు చేశారు. వైసీపీ వారిని ఎక్కువ మందిని అనుమతించినందుకు రిటర్నింగ అధికారి (ఆర్.ఓ) సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు

నాగుల చవితి ఎప్పుడూ .. ఆ రోజు ఏం చేయాలి

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:14 PM