సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:22 PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం.. ‘అబద్ధాల మూట’ అని భారత మాజీ ప్రధాని పి. వి. నరసింహరావు మనవడు ఎన్. వి. సుభాష్ అభివర్ణించారు.
హైదరాబాద్, నవంబర్12: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం ‘అబద్ధాల మూట’ (pack of lies) అని భారత మాజీ ప్రధాని పి. వి. నరసింహరావు మనవడు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్. వి. సుభాష్ అభివర్ణించారు. ఈ పుస్తకంలో దేశానికి, కాంగ్రెస్ పార్టీకి పి. వి. నరసింహరావు చేసిన సేవలను ఉద్దేశపూర్వకంగానే ఆమె విస్మరించారని ఆరోపించారు. అయితే ఇదేమీ తమకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదని అన్నారు. తమ కుటుంబ సభ్యులను ప్రముఖంగా చూపించడం కోసం.. పార్టీలోని సొంత నాయకులను విస్మరించడం, వారిని కించపరచడం గాంధీ ఫ్యామిలీకి అలవాటేనని తెలిపారు.
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు పితామహుడు, దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి పి. వి. నరసింహరావు అని గుర్తింపునకు అర్హులని ఎన్. వి. సుభాష్ స్పష్టం చేశారు. ఆయన లేకుంటే భారత్ సంస్కరణలను సాధించగలిగేదా? అని ప్రశ్నించారు. అయితే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను గౌరవిస్తానని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్ని విమర్శలు ఎదురైనా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చి.. ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇచ్చింది పి. వి. నరసింహరావు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి సేవ చేసిన మాజీ ప్రధాని, భారతరత్న పి. వి. నరసింహరావును సోనియా గాంధీ ఎందుకు గుర్తించడం లేదంటూ ఎన్. వి. సుభాష్ సందేహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీని చెక్కుచెదరకుండా ఉంచడంలో పి.వి కీలక పాత్ర పోషించారని వివరించారు. సోనియా ఆత్మకథలో ఎమర్జెన్సీ కాలంతోపాటు కేంద్రంలో గాంధీ కుటుంబం అధికారంలో ఉన్న సమయానికి సంబంధించిన చారిత్రక తప్పిదాలు ఉన్నాయని తెలిపారు. 2024లో దివంగత మాజీ ప్రధాని పి. వి. నరసింహరావు సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. ఆయనకు భారతరత్నను ప్రకటించిందని ఎన్.వి.సుభాష్ గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగుల చవితి ఎప్పుడూ .. ఆ రోజు ఏం చేయాలి
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More TG News And Telugu News