ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు మణిహారం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:26 PM
గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.
అమరావతి, జులై 27: గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మణిహారంగా నిలవనుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని సభకు వచ్చే ప్రజల రవాణా కోసం సుమారు 2 వేల బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతామని మంత్రి అన్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రయాణికులకు సాధారణ బస్సు ఛార్జీలతోనే ఎలక్ట్రిక్ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని... అందులో భాగంగా 1,400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో దశలవారీగా మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామన్నారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ సంకల్పమని రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. భోగాపురం విమానాశ్రయం దూరమనే అపోహ అవసరం లేదని... హైదరాబాద్‌కు శంషాబాద్ విమానాశ్రయం ఎలా విజయవంతమైందో, భోగాపురం కూడా అలాగే అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని తెలిపారు. విశాఖ అంటే ఉత్తరాంధ్రకు గుండెకాయ అని.. విశాఖ అభివృద్ధే ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
దయచేసి వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. చంద్రబాబు ఉంటేనే ఏపీకి భవిష్యత్తు: బుద్దా వెంకన్న
దేశం ప్రశాంతంగా ఉండటానికి కారణం జవాన్లే: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News