నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంక్.. సుజనా చౌదరి రియాక్షన్
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:41 PM
అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తొలిసారిగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆ తర్వాత నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తునే ఉన్నానని ఆయన వివరించారు.
విజయవాడ, ఫిబ్రవరి 10: తన నియోజకవర్గంలో 'నో దందా, నో చందా' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్పారు. తన నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం స్పందించారు. ఈ నియోజకవర్గానికి తాను చేసింది తక్కువే అని.. చేయాల్సింది ఎక్కువే ఉందని తెలిపారు.
నియోజకవర్గంలో చందా.. దందా లేకుండా దాదాపుగా నియంత్రించామని విశ్వాసం వ్యక్తం చేశారు. ర్యాంకింగ్ అనేది ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలయ్యాయనే దాని మీద ఇచ్చారని ఎమ్మెల్యే సుజనా చౌదరి వివరించారు. ఎమ్మెల్యేగా తనకు కూడా ఫస్ట్ టైమ్ అని.. అలాగే నియోజకవర్గ ప్రజలంతా తనకు సహకరించారని సంతోషం వ్యక్తం చేశారు. కూటమిలోని మూడు పార్టీల వారు కలిసి పని చేశారని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తొలిసారిగా ఈ నియోజకవర్గంలో పర్యటించానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి గుర్తు చేశారు. ఆ తర్వాత నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నానని వివరించారు. ఈ నియోజకవర్గంలో తాను చేసింది 25 శాతం లేదా 30 శాతం మాత్రమేనని.. ఇంకా చేయాల్సింది 75 శాతం మిగిలి ఉందన్నారు. ఆ దిశగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా అన్నీ మనమే చేయలేమని.. డెలిగేట్ ద్వారా పని చేయించగలమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేయడానికి ఎంత వీలు అయితే అంత చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఉన్న పథకాలు తీసుకొని.. ఇంకా చాలా వరకు మెరుగుపరిచామని వివరించారు.
స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తన ఫోకస్ ప్రివెంటివ్ సిక్నెస్ మీదనేనని చెప్పారు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్.. పని మానేసి హాస్పిటల్స్ వెళ్లకుండా మెటర్నిటీ సెంటర్స్ పెడితే ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పారు. దీంతో పాటు పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కోసం.. ఎన్జీవోస్‌తో మాట్లాడి ఐవోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ప్రవేశపెడతామన్నారు. ఆ తర్వాత మొబైల్ హెల్త్ వ్యాన్స్ పెట్టామని తెలిపారు. వీలైనంత వరకు తాను సుజనా ఫౌండేషన్ వారితో మాట్లాడానన్నారు. అందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భాగ్యనగర్ గ్యాస్ తదితర సంస్థలు సహకరించాయన్నారు. మిగిలిన ఫార్మా కంపెనీలతో కూడా తాను కాంటాక్ట్ చేస్తూ ఉన్నానని చెప్పారు.
ప్రజల సమస్యలపై అందుబాటులో ఉండటం కోసం ‘సుజనా మిత్ర’ పేరుతో ప్రతి డివిజన్‌లో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి.. సిబ్బందిని నియమించామని వివరించారు. నేతలంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పని చేస్తున్నారని చెప్పారు. ఈ పశ్చిమ నియోజకవర్గం మినీ ఇండియా అని అభివర్ణించారు. అందరూ కలిసికట్టుగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. అందువల్లే ఇదంతా చేయగలిగామన్నారు. భవిష్యత్తులో మరింత ఆదర్శంగా ఉండేలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు.
Also Read: