బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:40 PM
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ మరో హిందువును దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. మైమెన్ సింగ్ జిల్లాలో సుషేన్ చంద్ర సర్కార్ అనే బియ్యం వ్యాపారి ఈనెల 9వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, హత్యాకాండలు ఆగడం లేదు. మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండగా మరో హిందువును దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. మైమెన్ సింగ్ జిల్లాలో సుషేన్ చంద్ర సర్కార్ (Sushen Chandra Sarkar) అనే బియ్యం వ్యాపారి ఈనెల 9వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇదే జిల్లాలో దీపూ చంద్ర దాస్ అనే హిందువును ఇటీవల అత్యంత దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని తగులబెట్టిన సంఘటన సంచలనమైంది.
దుకాణంలోనే హత్య..
దక్షిణకాండ గ్రామ నివాసి అయిన 62 ఏళ్ల సుషేన్ చంద్ర సర్కార్ బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారని, మృతదేహాన్ని దుకాణంలోనే వదిలి షట్లర్లు మూసేశారని చెప్పారు. హత్యానంతరం లక్షలాది రూపాయలు దోచుకుని పరారైనట్టు వెల్లడించారు. దుకాణంలో రక్తం మడుగులో సర్కార్ కనిపించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సర్కార్ ప్రాణాలు కోల్పోయారు.
దుండగులు తన తండ్రిని చంపిన తర్వాత దుకాణంలోని సొమ్ము కూడా ఎత్తుకెళ్లినట్టు సర్కార్ తనయుడు సుజన్ సర్కార్ తెలిపారు. తమకు చాలాకాలంగా బియ్యం దుకాణం ఉందని, ఎవరితోనూ శత్రుత్వం లేదని తెలిపారు. తన తండ్రిని పొట్టనపెట్టుకున్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
ఆ టారిఫ్స్ డబ్బును భారత్‌కు తిరిగి చెల్లించనున్న అమెరికా!
దయచేసి మా దేశంపై దాడి చేయండి.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్ వ్యక్తి ఆత్మహత్య..