ఆ టారిఫ్స్ డబ్బును భారత్‌కు తిరిగి చెల్లించనున్న అమెరికా!
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:08 PM
రష్యా చమురు కొన్నందుకు భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 6న ఆదేశాలు జారీ చేశారు. ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేలోపు వసూలు చేసిన సుంకాలను అమెరికా భారత్‌కు తిరిగి చెల్లించనుందని తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే భారత్, అమెరికా దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అంతకుముందు, ఫిబ్రవరి 6న భారత్‌పై సుంకాలను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే లోపు భారత్ నుంచి యూఎస్ కస్టమ్స్ శాఖ తీసుకున్న సుంకాల డబ్బును అమెరికా రీఫండ్ చేసే యోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (US Tariffs Refund to India)
భారత్‌పై సుంకాలను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 6 కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా కాలమానం ప్రకారం, ఫిబ్రవరి 7 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కొత్త సుంకాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేందుకు కొంత సమయం పట్టింది. ఈలోపు అక్కడి అధికారులు భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలను విధించారు. ఇలా పుచ్చుకున్న మొత్తాల్లో కొంత మేరకు భారత్‌కు తిరిగివ్వాలని అమెరికా యంత్రాంగం యోచిస్తోంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు రాకమునుపు విధించిన సుంకాలపై మాత్రం ఎలాంటి రీఫండ్‌లు ఉండవని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇక రీఫండ్ మొత్తం ఏ మేరకు ఉంటుందనేది ఇంకా తెలియరాలేదు.
రీఫండ్‌ల విషయంలో అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి 6 నాటి ఉత్తర్వుల్లోనే స్పష్టత ఇచ్చింది. తమ చట్టాలు, కస్టమ్స్ శాఖ వివిధి విధాలను అనుగుణంగానే రీఫండ్స్ ఉంటాయని తేల్చి చెప్పింది. అంటే.. రీఫండ్ అన్ని సందర్భాలకు వర్తించవని నిపుణులు వివరిస్తున్నారు.
ఇటీవల కుదిరిన మధ్యంతర ఒప్పందంలో భాగంగా భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాన్ని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు కూడా అమెరికా పేర్కొంది. ఇక రీఫండ్స్‌పై మరింత స్పష్టతనిచ్చేలా అమెరికా కస్టమ్స్ శాఖ మరికొన్ని రోజుల్లో సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
దయచేసి మా దేశంపై దాడి చేయండి.. ట్రంప్‌ను అభ్యర్థించి ఇరాన్ వ్యక్తి ఆత్మహత్య..
కెనడాకు వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి బెదిరింపు..