Share News

దశాబ్దాల కల నెరవేర్చనున్న సీఎం.. 30న క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:07 PM

పేదలకు పట్టాభిషేకంలో భాగంగా మరో ప్రతిష్ఠాత్మక ఘట్టానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 30న విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించనున్నారు.

దశాబ్దాల కల నెరవేర్చనున్న సీఎం.. 30న క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
AP Government

అమరావతి, సెప్టెంబర్ 26: పేదలకు పట్టాభిషేకంలో భాగంగా మరో ప్రతిష్ఠాత్మక ఘట్టానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 30న విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించనున్నారు. విశాఖ తరహాలోనే విజయవాడలోనూ భారీ ఎత్తున 24,057 మందికి ఇళ్ల రెగ్యులరైజేషన్ పట్టాలను అందజేయనున్నారు. విజయవాడలో దశాబ్దాల క్రితం ఇచ్చిన ఎన్టీఆర్ పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణ పట్టాలను సీఎం పంపిణీ చేయనున్నారు. ప్రతి ఎన్నికలోనూ విజయవాడలో ప్రధాన ఎన్నికల అజెండాగా మిగిలిపోతున్న ఇళ్ల పట్టాల సమస్యకు కూటమి సర్కార్ శాశ్వత పరిష్కారం చూపుతోంది.


ఇటీవలే విశాఖలో పండుగ వాతావరణంలో రూ.8874 కోట్ల విలువైన భూమిపై 28,445 కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణ పట్టాలను లబ్ధిదారులకు సీఎం అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవాడలో రూ.9800 కోట్ల విలువైన భూమిపై 24,057 కుటుంబాలకు రెగ్యులరైజేషన్ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి రమారమి రూ.40-45 లక్షలకు వరకు లబ్ధి చేకూర్చేలా క్రమబద్ధీకరణ పట్టాలను ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం నియోజవర్గం పరిధిలోని మొత్తం 8 నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో సంపూర్ణ హక్కులతో ఈ పట్టలను అందజేస్తారు. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు, అలాగే విజయవాడ నగరంలోని 3 నియోజకవర్గాల పరిధిలోని కొండలపై నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలను అందిస్తూ లబ్ధిదారుల కలలను సీఎం చంద్రబాబు సాకారం చేయనున్నారు.


క్రమబద్ధీకరణ పట్టాలిస్తే తమ ఇళ్లకు శాశ్వత భద్రత, భవిష్యత్తుకు భరోసా ఉంటుందని దశాబ్దాలుగా కొండ ప్రాంత నివాసితులు డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే. ఇటీవల జరిగిన జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశంలోనూ ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్‌పై ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దశాబ్దాల కలను నిజం చేస్తూ 617 ఎకరాల్లోని 29.86 లక్షల చదరపు గజాల స్థలంపై సంపూర్ణ హక్కులను ప్రభుత్వం కల్పించనుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సంపూర్ణ హక్కు కల్పిస్తూ రెగ్యులరైజేషన్ పట్టాలిస్తున్న భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 24,297 కోట్లుగా ఉంటుందని అంచనా. సంపూర్ణ హక్కులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం పంపిణీ చేయబోతోన్న పట్టాల ద్వారా బీసీలు 12093, ఓసీలు 6130, ఎస్సీలు 4546, ముస్లిం బీసీలు 955, ఎస్టీలు 333 కుటుంబాలకు లబ్ధిచూకూరనుంది.


నియోజకవర్గాల వారీగా లబ్దిదారుల సంఖ్య:

• విజయవాడ (తూర్పు) - 7990

• విజయవాడ (పశ్చిమం) - 7465

• విజయవాడ (సెంట్రల్) - 5815

• గన్నవరం - 602

• జగ్గయ్యపేట - 1135

• మైలవరం - 981

• నందిగామ - 54

• తిరువూరు - 15


ఇవి కూడా చదవండి...

ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డులు.. ఏపీ, తెలంగాణకు పలు విభాగాల్లో గోల్డ్ అవార్డులు

స్థానిక ఎన్నికలపై కూటమి భేటీ.. సమన్వయంతో పనిచేయాలని మంత్రుల పిలుపు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 04:19 PM