Share News

‘మనం జీవించినా.. మరణించినా దేశం కోసమే’.. రాజ్యసభలో ఎంపీ విజయ్ ఉద్వేగ ప్రసంగం

ABN , Publish Date - Jul 29 , 2026 | 04:16 PM

రాజ్యసభలో దేశభక్తి, ‘వందేమాతరం’ విశిష్టతపై టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ​రాజ్యసభ సమావేశాలలో భాగంగా ‘నేషనల్ ఆనర్ అమెండ్‌మెంట్ బిల్లు’పై విజయ్ ప్రసంగించారు.

‘మనం జీవించినా.. మరణించినా దేశం కోసమే’.. రాజ్యసభలో ఎంపీ విజయ్ ఉద్వేగ ప్రసంగం
MP Chintakayala vijay

న్యూఢిల్లీ, జులై 29: రాజ్యసభలో దేశభక్తి, ‘వందేమాతరం’ విశిష్టతపై టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ​రాజ్యసభ సమావేశాలలో భాగంగా ‘నేషనల్ ఆనర్ అమెండ్‌మెంట్ బిల్లు’పై విజయ్ మాట్లాడుతూ.. ఈ క్షణం కేవలం ఓ వ్యక్తికి సంబంధించినది కాదని, ప్రజల నమ్మకానికి ప్రతీక అని అన్నారు. భారత ప్రజాస్వామ్య శక్తికి, జాతీయ ఆత్మను ప్రతిబింబించే ‘వందేమాతరం’ స్వరానికి ప్రతీకగా నిలిచే సందర్భమని అని పేర్కొన్నారు. ​భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని.. ఇది ఒక సజీవమైన సాంస్కృతిక వారసత్వమని అభివర్ణించారు. ఇది వందన, అభినందన, అర్పణ, తర్పణ భూమి అని ఉద్ఘాటించారు. దేశంలో పారే ప్రతి నది గంగతో.. ప్రతి రాయి శంకరునితో సమానమని పేర్కొన్నారు. ‘మనం జీవించినా, మరణించినా ఈ దేశం కోసమే... చివరికి మన అస్థికలు గంగాజలంలో కొట్టుకుపోతున్నప్పుడు ఎవరు చెవిపెట్టి విన్నా ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అనే శబ్దాలే వినిపిస్తాయి’ అని అన్నారు.


​దేశ స్వాతంత్ర్య పోరాటంలో ‘వందేమాతరం’ తెచ్చిన స్ఫూర్తిని, త్యాగాలను ఈ సందర్భంగా ఎంపీ విజయ్ గుర్తు చేసుకున్నారు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రూపొందించిన ‘వందేమాతరం’ అనే రెండు పదాలు కోట్లాది మందిలో దేశభక్తిని రగిలించాయని అన్నారు. 1908లో కేవలం 18 సంవత్సరాల వయస్సులోనే ఖుదీరామ్ బోస్ ఉరికంభాన్ని ఎక్కుతూ ‘వందేమాతరం’ అని గర్జించారని గుర్తుచేశారు. అలాగే కాలాపానీ సెల్యులార్ జైలులో వీర్ సావర్కర్ క్రూరమైన చిత్రహింసలను తట్టుకుంటూ ‘వందేమాతరం’ అని బదులిచ్చారని తెలిపారు. ఆల్ఫ్రెడ్ పార్క్‌లో చంద్రశేఖర్ ఆజాద్ లొంగిపోకుండా ప్రాణాలర్పించే సమయంలోనూ ఇదే నినాదాన్ని పలికారన్నారని చెప్పుకొచ్చారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని ఈ సందర్భంగా చింతకాయల విజయ్ స్మరించుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం.. అల్లూరిని చెట్టుకు కట్టేసి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపినప్పుడు కూడా ఆయన నోటి నుంచి వచ్చిన చివరి మాట ‘వందేమాతరం’ అని గుర్తుచేశారు. ఈ విప్లవ వీరుని త్యాగానికి గౌరవంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అల్లూరి సీతారామరాజుకు శిరస్సు వంచి ప్రణామాలు అర్పించారని కొనియాడారు.


​మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ రాసిన ‘బాధాయే ఆతీ హై ఆయే’ అనే ప్రసిద్ధ కవితా పంక్తులను సభలో ప్రస్తావిస్తూ.. ఎంతటి ఆటంకాలు వచ్చినా, అగ్నిజ్వాలలు ఎదురైనా అడుగులో అడుగు వేసి ముందుకు సాగాలని ఎంపీ పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే దేశం పురోగమిస్తుందని స్పష్టం చేశారు. ‘వందేమాతరం’లో మిగిలిన రెండు చరణాలకు సముచిత స్థానం కల్పించి, గౌరవాన్ని పెంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు ఈ అవకాశం లభించేలా ప్రోత్సహించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఎంపీ చింతకాయల విజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

జగన్ క్రెడిట్‌ చోరీ చేస్తే జైలుకే.. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెటైర్

రైతులను ముంచే స్టేట్‌మెంట్లు మానుకో.. జగన్‌కు అచ్చెన్నాయుడు హితవు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 04:22 PM