ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:26 PM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై ఈ రోజు(శుక్రవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో రూలింగ్ పార్టీలో ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం తెలిపింది. తప్పుచేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని నిలదీసింది.
పోలీసులు.. నిందితుడితో ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు డీఫాల్ట్ బెయిల్‌ను పొడగించిన న్యాయస్థానం.. నవంబర్ 30లోగా ట్రయల్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఈ కేసులో జోక్యం చేసుకుని ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. వేగంగా ట్రయల్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు ఉన్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాలివే..
విచారణను చాలా సీనియర్ న్యాయ అధికారికి అప్పగించాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించింది.
అభియోగాల రూపకల్పనను 2026 ఏప్రిల్ 18 లోగా నిర్ణయించాలి.
అభియోగాల నమోదు తర్వాత సాక్ష్యాల పరిశీలనను ముగించాలి.
ఏదైనా తదుపరి దర్యాప్తు అవసరమైతే 2026 మార్చి 31లోగా పూర్తి చేయాలి.
ఈ కేసు విచారణను 2026 నవంబర్ 30లోగా ముగియాలి.
ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని ఇతర విషయాల నుంచి విముక్తి కల్పించి, ఈ కేసుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
విచారణను నిలిపివేయడానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదు.
ఇవి కూడా చదవండి...
గోదావరి నది పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల
అమరావతిలో పోలీసుల క్రికెట్ పోటీలు.. పాల్గొన్న హోం మంత్రి అనిత
Read Latest AP News And Telugu News