Share News

హిందూ సమాజానికి వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాలి: మంత్రి పయ్యావుల

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:48 AM

వేంకటేశ్వర స్వామి వారి ఫొటోలను శాసన మండలిలోకి విపక్ష వైసీపీ సభ్యులు తీసుకురావడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

హిందూ సమాజానికి వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాలి: మంత్రి పయ్యావుల

అమరావతి, ఫిబ్రవరి 20: శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఫొటోలను శాసన మండలిలోకి విపక్ష వైసీపీ సభ్యులు తీసుకురావడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. వైసీపీ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. దేవుడి ఫొటోలు పట్టుకుని చెప్పులతో సభలోకి వచ్చారంటూ విపక్ష సభ్యులపై మండిపడ్డారు. సభలో ప్రతిరోజూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారంటూ వైసీపీ సభ్యుల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.


హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సభ్యుల తీరు ఉందన్నారు. వైసీపీ సభ్యులు హద్దులు దాటి ప్రవర్తించారని పేర్కొన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏమిటని వైసీపీ సభ్యులను మంత్రి పయ్యావుల సూటిగా ప్రశ్నించారు. హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. దేవదేవుడి పట్ల వైసీపీ వైఖరి ఏంటో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సభ్యులకు ఆయన సూచించారు.


హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ: ఎమ్మెల్సీ సోము

శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బ తీసిందని విమర్శించారు. చెప్పులేసుకుని దేవుడి ఫొటోలతో సభలోకి రావడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. దేవుడి ఫొటోలు విసిరేయడం అవమానకరమని అభివర్ణించారు. హిందువులను అవమానించినందున వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దేవుడు అంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ సహా వైసీపీ నేతలకు భయం, భక్తి లేవని తెలిపారు. భవిష్యత్‌లో కూడా వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం చెప్పారు.


ఇవి కూడా చదవండి..

నేతన్నకు కూటమి సర్కార్ తీపి కబురు

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 01:24 PM