Sankranti Cockfights: హోరాహోరీగా కోడి పందేలు.. భారీగా తరలివచ్చిన జనం
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:22 PM
ఏపీలో కోడి పందేలు హోరాహోరీగా సాగుతున్నాయి. పందేల్లో భాగంగా లక్షల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం. కోడిపందేలను వీక్షించేందుకు పెద్దఎత్తున జనం తరలివస్తున్నారు.
అమరావతి, జనవరి 14: రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ(Sankranti Festival) సందర్భంగా కోడి పందేలు (Cockfights) జోరుగా సాగుతున్నాయి. సంప్రదాయంగా భావించే ఈ కార్యక్రమాలు ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కోడి పందేలకు బరులు ముస్తాబయ్యాయి. ఈ పందేలను చూసేందుకు దూరప్రాంతాల ప్రజలు సైతం పెద్దఎత్తున తరలివస్తున్నారు. బరుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు నిర్వాహకులు. అయితే.. గతంలో లాగానే ఈసారీ కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కోడిపందేలు, గుండాటలు ప్రారంభమయ్యాయి. ప్రతి గ్రామంలోనూ కోడిపందేలు, గుండాటలు ఏర్పాటయ్యాయి. 'మూడు బరులు.. ఆరు బోర్డులు' అన్నట్లు నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 150కిపైగా కోడిపందేల బరులు ముస్తాబయ్యాయి.
గుడివాడ నియోజకవర్గంలో సంక్రాంతి కోడిపందేలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. కోడిపందేలు, కోత ముక్కలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితి. బరులు జాతరను తలపిస్తున్నాయి. హోరాహోరీగా కోడి పందేలు జరుగుతున్నాయి. కోడి పందేలను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో బరులను ఏర్పాటుచేశారు.
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా మొదలయ్యాయి. కైకలూరు మండలం భుజబలపట్నంలో ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటుచేసి మరీ కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ఈ పందేలను ఎమ్మెల్సీ జయమాంగళ వెంకటరమణ తిలకించారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. బరుల్లో భారీ లైవ్ స్క్రీన్లను ఏర్పాటుచేయడంతో పాటు నాయకులు, ప్రజలు కూర్చుని చూసేందుకు బరిచుట్టూ స్టేజ్‌ను నిర్వాహకులు ఏర్పాటుచేశారు.
ఇవి కూడా చదవండి...
భోగి వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన భారీ భోగి దండ
ఏపీ వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు
Read Latest AP News And Telugu News