Bhogi Celebrations: భోగి వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన భారీ భోగి దండ
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:17 AM
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు శ్రమంచి 20 వేల ఆవు పిడకలతో 1000 అడుగుల భారీ భోగి మాలను రూపొందించారు.
కోనసీమ జిల్లా, జనవరి 14: హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి(Sankranti Festival) ఒకటి. తెలుగువారు మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా మొదటి రోజు నిర్వహించే భోగి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. తెల్లవారుజామునే అభ్యంగ స్నానమాచరించి.. ఆవు పేడతో చేసే పిడకలను భోగి మంటల్లో వేస్తారు. చిన్నా పెద్దా అంతా కలిసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడిపాడుతూ ఉత్సాహంగా గడుపుతారు. ప్రతి ఇంటి ముంగిళ్లలో భోగి మంటలు దర్శనమిస్తాయి. ఇంట్లోని పాత, ఉపయోగంలో లేని వస్తువులను భోగి మంటల్లో వేస్తే శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఇదిలా ఉండగా.. భోగి పండుగను పురస్కరించుకుని అంబేడ్కర్ కోనసీమలో రూపొందించిన భారీ భోగి దండ అందరినీ ఆకట్టుకుంటోంది. అమలాపురంలోని రంగాపురం గ్రామస్థులు ఈ భోగి మాలతో నేటి సంక్రాంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
దాదాపు 20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు గ్రామస్థులు. ఆ ఊళ్లోని విశ్వనాథ రాజు కుటుంబం.. స్థానికులతో కలిసి ఆవు పేడతో 20 రోజుల పాటు శ్రమించి ఈ హారాన్ని తయారు చేసింది. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకు గత ఆరేళ్లుగా భారీ భోగి దండలను గ్రామస్థులు తయారు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం 400 అడుగులతో మొదలైన భోగి దండ తయారీ నేడు 1000 అడుగులకు చేరిందని ఆ ఊరి ప్రజలు వివరించారు. సుమారు అర కిలోమీటర్ మేర ఉన్న ఈ భారీ భోగి మాలను గ్రామస్థులతో కలిసి విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు భోగి మంటలో వేశారు. ఈ మాలను మంటలో వేసేందుకు తరలివచ్చిన వారితో ఈ ఊళ్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం.. ఈ భారీ భోగి దండ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
14 వేల పిడకలతో...
మరోవైపు.. కాకినాడ జిల్లా పిఠాపురం జై గణేశ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో 14 వేల ఆవు పిడకలతో భోగిమంట వేశారు. ఆలయం నుంచి మేళ తాళాలు, తప్పెడు గూళ్లు, గంగిరెద్దులు, హరిదాసుల సంకీర్తనలతో కోటగుమ్మం సెంటర్ వద్ద భోగి మంట వేశారు. ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ భోగి మంట వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు
సర్వ శుభాలనిచ్చే సంక్రాంతి.. ఆరోగ్యాన్నిచ్చే పిండివంటలు
Read Latest AP News And Telugu News