Bhogi Festival Significance: నేడు భోగి పండుగ.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:59 AM
మూడు రోజుల పండుగలో మొదటి రోజైన భోగిని ఇవాళ జరుపుకుంటున్నాం. అయితే.. భోగి పండుగ ప్రత్యేకత మీకు తెలుసా? భోగి అనే పేరు ఎలా వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి? భోగి మంటలు ఎందుకు వేస్తారు? పిల్లలకు భోగిపండ్లు ఎందుకు వేస్తారు? అనే విషయాలను ఓసారి తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి పండుగను నేడు ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే.. భోగి పండుగ ప్రత్యేకతలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
'భోగి' అనే పేరు ఎలా వచ్చిందంటే?
భోగి అనే పదం సంస్కృతంలో ‘భోగం’ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఆనందం, సుఖం. పూర్వకాలంలో, భోగి రోజున పాతవి వదిలి కొత్త వాటిని ప్రారంభించడానికి సంకేతంగా దీన్ని జరుపుతారు. పౌరాణిక కథల ప్రకారం.. విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి పంపిన రోజు, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తిన రోజుకూ భోగితో సంబంధముందని పెద్దలు చెబుతారు.

భోగి మంటలు ఎందుకు వేయాలి?
భోగి రోజున మంటలు వేయడం అనేది ప్రధాన సంప్రదాయం. శాస్త్రీయంగా చూస్తే, భోగి సమయానికి సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో జనవరి నెలలో చలి తీవ్రంగా ఉంటుంది. మంటల వలన ఉష్ణం ఉత్పత్తి అవుతుంది, చలి తగ్గుతుంది, అలాగే పాత, అనవసర వస్తువులు కాల్చడం ద్వారా శుభ శక్తిని ఆహ్వానిస్తారు. ఆవు పిడకలను భోగి మంటల్లో ఉపయోగించడం వల్ల హానికరమైన వాయువులు తక్కువగా విడుదలవుతాయి. మంటల ద్వారా గాలి శుభ్రం అవుతుంది. మంటల వలన వాతావరణంలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. శ్వాస సంబంధిత వంటి అనారోగ్యాల సమస్యలూ తగ్గుతాయని నమ్మకం.

భోగి పండుగలో పాటించే సంప్రదాయాలు
భోగి మంటలు: పాత వస్తువులు, పాత వస్త్రాలు, చెరుకులు, ఆవు పిడకలు మంటలో వేస్తారు.
ఈ మంటల ద్వారా చెడు శక్తులు తొలగిపోతాయని నమ్మకం.
పిల్లలకు భోగి పండ్లు పోస్తారు.
చిన్నపిల్లల తలపై రేగుపండ్లు, చెరుకు ముక్కలు, బంతి పువ్వులతో భోగి పండ్లు పోస్తారు. ఇది ఆరోగ్యం, ఆనందం కలిగించే సంప్రదాయం.
బొమ్మల కొలువు
మన సంస్కృతీ సంప్రదాయాలను.. ముఖ్యంగా రామాయణ, మహాభారత, భాగవత గాథలను కథల రూపంలో పిల్లలకు తెలియజేయడానికి బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. ఇది పిల్లలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతుంది. కళాత్మక దృష్టిని పెంచుతుంది.
భోగి పండుగ ప్రాముఖ్యత
భోగి పండుగను పాతది వదిలి, కొత్తది ఆహ్వానించాలనే ఆలోచనతో జరుపుకుంటారు. ఈ రోజు మన జీవితంలో చెడు అలవాట్లు, చెడు ప్రవర్తనను వదిలి ఆనందం, సుఖం, ఆరోగ్యం కోసం నూతనంగా ప్రారంభించడానికి మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోనూ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News