Guava Health Benefits: జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:08 PM
జామపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే జామపండును ఎలా తింటే మంచిది? తొక్కతో తినాలా? లేక తొక్క తీసేసి తినాలా?
ఇంటర్నెట్ డెస్క్: జామపండు చాలా మందికి ఇష్టమైన పండు. పోషకాలతో నిండిన ఈ పండును చాలా మంది ‘సూపర్ ఫ్రూట్’ అని అంటారు. అయితే జామపండును తొక్కతో తినాలా? లేక తొక్క తీసేసి తినాలా? అని ఎక్కువ మందికి సందేహం ఉంటుంది. ఈ విషయంపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల ప్రకారం, జామపండును తొక్కతో తింటే పొటాషియం, జింక్, విటమిన్ C వంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జామపండును తొక్క లేకుండా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే తొక్కతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
జామపండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: జామపండులో విటమిన్ C చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. ఒక జామపండు తింటే రోజుకు అవసరమైన విటమిన్ C కంటే ఎక్కువే లభిస్తుంది.
జీర్ణక్రియ మెరుగవుతుంది: జామపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.
చర్మానికి మెరుపు ఇస్తుంది: జామలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ A ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ముడతలు రాకుండా సహాయపడతాయి.
గుండె ఆరోగ్యానికి మంచిది: పొటాషియం, మెగ్నీషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. క్రమం తప్పకుండా జామపండు తినేవారిలో బీపీ, కొలెస్ట్రాల్ తగ్గినట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
మీకు డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలు లేకపోతే జామపండును తొక్కతో తినొచ్చు. అలాంటి సమస్యలు ఉంటే తొక్క తీసేసి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువగా నష్టపోతారు..
For More Latest News