Sankranti: పల్లెకు సంక్రాంతి.. బంధుమిత్రులతో సందడే సందడి
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:28 AM
సంక్రాంతి పండగ శోభతో అటు పల్లెలు.. ఇటు పట్టణాలు కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. నేడు భోగి సందర్భంగా.. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరోవైపు.. పండగ సెలవులు మొదలైపోయి ఎక్కడి జనం అక్కడ సొంతూళ్లకు చేరినా సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది.
ఏం బావా బాగున్నావా.! ఏంటే మరదలా ఏం చేస్తున్నావ్.! ఏరా ఎలా ఉన్నావ్.! ఏమేవ్ బాగున్నావా.! అప్పుడే మనం కలిసి ఏడాదైపోయింది.. గత సంక్రాంతి ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది.. ఇలా గోదావరి జిల్లాల్లో పల్లెలన్నీ సరదా సరదా పలకరింపులతో ఊపిరి పోసుకుంటున్నాయి.. నిన్నటి వరకూ నీరసం ఆవహించిన పల్లెల్లో సంక్రాంతులు వచ్చాయి.. ఇంటింటా సరదాలు తెచ్చింది.. ఏడాది కిందట మూతపడిన ఇళ్ల తలుపులు తెరుచుకున్నాయి.. పిల్లా పెద్దా అందరితో సందడి.. సందడిగా మారాయి... కొత్త ధాన్యాలతో.. కోడి పందేలతో.. కొత్త అల్లుళ్లతో... కొంటె మరదళ్లతో ఇంటింటా ఆనందమే.. పెద్దలు పెద్ద పండుగను సంబరంగా చేసుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పల్లెలు సంక్రాంతి పండగ శోభతో కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలు.. పెద్దలు.. కుటుంబాలు.. బంధుమిత్రుల రాకతో సందడితో సరదా సరదాగా మారాయి. స్నేహితుల పలకరింపులు పాతకాలపు ఆటపాటలతో సరికొత్త సంక్రాంతి నింపుతున్నాయి. అటు కోడిపందేలకు బరులు ముస్తాబయ్యాయి. విందులు, ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధమయ్యాయి. ఇటు బుధవారం తెల్లారే భోగి మంటలు.. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. మరోవైపు.. పండగ సెలవులు మొదలైపోయి ఎక్కడి జనం అక్కడ సొంతూళ్లకు చేరినా సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే విమానాలు, రైళ్లలో ఒక్కసీటూ దొరకడం లేదు. ఒక్క సంక్రాంతి పండగ రోజైన గురువారం మాత్రమే టికెట్లు లభ్యమవుతున్నాయి.
పండగే.. పండగ..
ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండగ సందడి పెరిగింది. నేడు.. భోగి పండగ కావడంతో ఎక్కడికక్కడ పల్లెగ్రామాలు పులకరిస్తున్నాయి. కుటుంబీకులు, బంధుమిత్రులు అంతా సొంతిళ్లకు చేరడంతో పండగ ఆనందం రెట్టింపయింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల్లో అన్ని చోట్లా గ్రామాల్లో సంక్రాంతి శోభ కళకళలాడుతోంది. ఇళ్లన్నీ కొత్త రంగులు.. ఇంటి ముందు లోగిళ్లు రంగేళీలతో ముస్తాబయ్యాయి. గ్రామాల్లో ఆలయాలు జాతరలు, తీర్థాలకు సిద్ధమవగా.. చెట్లకింద, ఆలయాల వద్ద అరుగులన్నీ చిన్ననాటి స్నేహితుల పాతకాలపు ముచ్చట్లతో ముచ్చట గొలుపుతున్నా యి. కుటుంబీకుల ఆప్యాయ పలకరింపుల మధ్య మహిళలు రకరకాల పిండివంటల్లో మునిగిపోయారు. కొత్త బట్టలు.. పాత పలకరింపులతో పల్లెలు మురిసిపోతున్నాయి. ఇంకోవైపు స్వగ్రామాలకు తరలివచ్చిన జనంతో ఆయా ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, చెరువుగట్లు సందడిగా మారాయి. అటు పండగ సినిమాలు వరుసగా విడుదలవడంతో థియేటర్లన్నీ జనంతో కళకళలాడుతున్నాయి.
ఇక.. బుధవారం భోగి పండగ కావడంతో గ్రామాల్లో యువత దుంగలు సేకరించి తెల్లవారుజామునే ఎక్కడికక్కడ మంటలు వేశారు. దీంతో భోగిసందడి పెరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా అన్నదాతలకు ఖరీఫ్ ధాన్యం డబ్బులు రూ.1900 కోట్లకు పైగా ఖాతాల్లో.. ధాన్యం ఇచ్చిన 24 గంటల్లోగా జమవడంతో రైతులంతా సంతోషంతో ఉన్నారు. పండగ ఆనందాన్ని రెట్టించిన ఉత్సాహంతో చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
రిజర్వేషన్లు ఫుల్‌గా..
విమానాలు, రైళ్లు, బస్సుల్లో రద్దీ కొనసాగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఇండిగో ఆరు సర్వీసులు నడుపుతుండగ.. ఇప్పటికే అవన్నీ నిండిపోయి బుక్ చేసుకుందామన్నా వెబ్‌సైట్లో ఒక్క విమానం కనిపించని పరిస్థితి. అన్ని రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టులు, రిగ్రేట్లు కనిపిస్తున్నాయి. అటు ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్‌లోనూ గురువారం వరకూ ఇదే దుస్థితి నెలకొంది.
ఇవీ చదవండి:
అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు
ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు.. వారికి పండగే