Share News

Sankranti Festival: సర్వ శుభాలనిచ్చే సంక్రాంతి.. ఆరోగ్యాన్నిచ్చే పిండివంటలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 08:09 AM

పుడమి తల్లిని నమ్ముకున్న పల్లెవాసుల సంతృప్తి, ఆనందాలకు ప్రతీక సంక్రాంతి. ధనుర్మాసంలో స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్రతం ఆచరించి యశోదా తనయునికి బాల భోగం సమర్పించి హారతి ఇస్తారు. యువతులు నెల రోజులు ముంగిట్లో కళ్లాపి చల్లి రకరకాల రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముగ్గులపై గొబ్బెమ్మలను ఉంచి బంతి, చామంతి, తంగేడు, గుమ్మడి పూలతో అలంకరించి పసుపు కుంకుమతో పూజిస్తారు. సంక్రాంతి అంటేనే సంప్రదాయాల పండుగ కావడంతో.. ప్రత్యేక వంటలు రుచితో పాటు మంచి ఆరోగ్యాన్నీ ఇస్తాయి.

Sankranti Festival: సర్వ శుభాలనిచ్చే సంక్రాంతి.. ఆరోగ్యాన్నిచ్చే పిండివంటలు
Sankranti Festival

ఇంటర్నెట్ డెస్క్: భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో ఆచరించే పూజలు, నోములు, బొమ్మల కొలువు ఎంతో ఆనందంతో పాటు సర్వ శుభాలను కలగజేస్తాయని నమ్ముకం కలుగుతుంది. పంచభూతాలలో పరమాత్మను దర్శించగలిగి, జ్ఞానమనే చీకటి నుంచి వెలుగు మార్గాన పయనమే సంక్రాంతి సూర్యదేవుడికి ఫలపుష్పాదులను సమర్పించి పూజిస్తారు. సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వచ్చినా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే కాలం పుణ్నపదమని నమ్మకం.


ముగ్గులతో ఆరోగ్యం..

ధనుర్మాసంలో వానలు తగ్గి భూమి పొడిగా ఉంటుంది. ఆవుపేడ కలిపిన నీటిని చల్లి ముగ్గులు పెడితే కంటికి ఇంపుగా ఉండడమే కాకుండా పురుగులు, విష కీటకాలు ఇంట్లోకి రావు. సున్నంతో పెట్టిన ముగ్గులు, గడపలు, గొబ్బెమ్మలకు పెట్టిన పసుపు కుంకుమలు ఇంటికి శోభనివ్వడమే కాకుండా పసుపు సూక్మజీవులను నశింపజేస్తుంది. హరిదాసులు, నందీశ్వరుడినే నాట్యమాడించే గంగిరెద్దుల వారు ఇచ్చినది తీసుకుని సంతృప్తిగా వెళ్లడం దానగుణాన్ని పెంపొందిస్తుంది.


పిండి వంటలు ప్రత్యేకం..

సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బంధువులు, సన్నిహితుల కోసం సంప్రదాయ వంటలు తయారు చేస్తారు. అరిసెలు, పాకుండలు, చనివిడి, సున్నుండలు, బెల్లం గవ్వలు, పూతరేకులు, నువ్వుల ఉండలు, కజ్జికాయలు, లడ్యూలు కరకజ్జం, గోరుమిటీలు, బెల్లం కొమ్ములు, కొబ్బరి నౌజు, చెగోడీలు, జంతికలు, చెక్క వడలు, మురుకులు, కారం బూంది, కారప్పూస, కారం గవ్వలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు లోగిళ్లలో మహిళలు పిండి వంటలు సిద్ధం చేశారు. ప్రస్తుతం కొంతమంది ఆర్డర్లపై పిండి వంటలు కొనుగోలు చేసుకుంటున్నారు. అరిసెలు కిలో రూ.800 నుంచి రూ.1000 గోరుమిటీలు, కజ్జికాయలు రూ.500 నుంచి రూ.600, జంతికలు, ఆకు వడలు, కరకజ్జం, వేరుశనగ అచ్చు, నువ్వు అచ్చులు కిలో రూ.500 నుంచి రూ.600 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు.


సాధారణంగా సంక్రాంతి నైవేద్యాలలో కట్టుపొంగలి, చక్కెర పొంగలి ఉంటాయి. పొంగలిలో ఉపయోగించే పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, అల్లం శ్లేష్మాన్ని పోగొట్టి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. నెయ్యి శరీరానికి పుష్టిని, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. తెల్లవారుజామునే లేవడం, స్నానం, భగవంతుని ప్రార్థించడం, పూజ, నైవేద్యాలు, ఆరోగ్య కారకం. పార్వతి దేవి శివుని భక్తగా పొందడానికి తపన్సు చేసి పూజించి.. పెనరపప్పు, బియ్యం, నెయ్యి కలిపి వండిన పొంగలిని వివేచన చేసినట్లు పురాణ కథనం.


తొలి పండుగ భోగి..

సంక్రాంతి తొలి పండుగ భోగి. తెల్లవారుజామునే చెట్టు దుంగలు, ఇళ్ల వద్దనున్న పాత సామానుతో మంటవేస్తారు. భోగి, పిడకలను వేస్తారు. బోగి మంటలలోనే నీళ్లను కాచుకుని అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు. నూతన వస్త్రాలు ధరించి ఆలయాలను దర్శించుకుంటారు. భోగమంటలు మానవుల్లోని కల్మషాలను తొలగిస్తాయని, సంకటాలను దగ్ధం చేస్తాయని ప్రతీతి. చెడును విడిచిపెట్టి మంచిని పెంపొందించుకోవటమే భోగి మంటల సందేశం. సూర్యగమనాన్ని భోగమంటారు. మనలోని అజ్ఞానాన్ని నశింపజేసి సన్మార్గంలో నడిపించమని అగ్నిదేవుని ప్రార్థించడమే భోగ మంటలోని పరమార్థం. ఈ పొగవల్ల క్రిమి కీటకాలు నశించి.. ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. భోగినాడు సాయంత్రం చిన్నారులకు భోగి పండ్లు పోయడం అనవాయితీ.


ఇవీ చదవండి:

పల్లెకు సంక్రాంతి.. బంధుమిత్రులతో సందడే సందడి

ఘనంగా గోదాదేవి కల్యాణమహోత్సవం

Updated Date - Jan 14 , 2026 | 09:02 AM