AP Bhogi Celebrations: ఏపీ వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:08 AM
సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు.
అమరావతి, జనవరి 14: ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) అంబరాన్నంటాయి. మూడు రోజుల సంక్రాంతి పండుగలో తొలిరోజు భోగి సంబరాలు వైభవంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటి ముంగిళ్లలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు రాష్ట్ర ప్రజలు. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు. అలాగే భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా భోగి సంబరాల్లో పాలుపంచుకున్నారు.
విజయవాడలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వివాన్ గేటెడ్ కమ్యూనిటీలో అత్యంత వైభవోపేతంగా భోగి సంబరాలు నిర్వహించారు. అటు ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో భోగి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం సొంత ఇంటి వద్ద భోగి పండుగ నేపథ్యంలో టెంకాయ, అరటి ఆకులతో ప్రత్యేక తోరణాలతో అలంకరించారు.
రఘురామ నివాసం వద్ద భోగి సంబరాలు
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పెదఅమిరంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నివాసం వద్ద భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి భోగి మంటలు వెలిగించారు.
సంక్రాంతి వేడుకల్లో చింతమనేని
ఏలూరూ సమీపంలోని దుగ్గిరాలలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. ఆపై భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.
ఏయూ కాలేజీలో సంక్రాంతి సంబరాలు..
విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో మహా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భోగి మంటలు వేశారు. ఈ వేడుకల్లో పెద్దఎత్తున స్థానికులు పాల్గొన్నారు. ఈనెల 9 నుంచి 16 వరకు కాలేజీ గ్రౌండ్స్‌లో మహా సంక్రాంతి సంబరాలు జరుగనున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సెట్టింగ్స్, సాంప్రదాయ బద్ధమైన నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
భోగి సంబరాల్లో మంత్రి నారాయణ..
నెల్లూరు జిల్లాలో పెద్దఎత్తున భోగి సంబరాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన భోగి సంబరాల్లో మంత్రి నారాయణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలతో కలిసి భోగి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో తులతూగాలని మంత్రి ఆకాంక్షించారు.
భోగి మంటల్లో గత పాస్ పుస్తకాలు..
విజయవాడలో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. వాడ వాడలా తెల్లవారుజాము నుంచే ప్రజలు భోగి మంటలు వేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఎంపీ శాస్త్రోక్తంగా పూజలు చేసి భోగి మంటలు వెలిగించారు. ఈ వేడుకల్లో టీడీపీ నేతలు గద్దె అనురాధ, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జగన్ ఫొటోతో ముద్రించిన పాస్ పుస్తకాలను భోగి మంటల్లో వేశారు టీడీపీ నేతలు. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలతో తెలుగు మహిళలు సందడి చేశారు.
ఏపీ అభివృద్ధిని ప్రపంచం గుర్తిస్తోంది: మంత్రి పార్థసారథి
విజయవాడ గొల్లపూడిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. వేడుకలలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్తి పత్రాలపై గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఫొటోతో రూపొందించిన జీవో కాపీలను స్థానిక రైతులు, మంత్రి, ఎమ్మెల్యే కలిసి భోగి మంటలలో వేసి తగలబెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోందన్నారు. వైసీపీ నాయకులకు రాష్ట్రంలో అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి పార్థసారథి మండిపడ్డారు.
హోంమంత్రి నివాసంలో భోగి వేడుకలు
రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మంత్రి నివాసం వద్ద కుటుంబ సమేతంగా భోగి వేడుకలో అనిత పాల్గొన్నారు. భోగి పర్వదినం సందర్భంగా హోంమంత్రి నివాసం కోలాహలంగా మారింది. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా భోగి వేడుకలు నిర్వహించారు. భోగి పండుగ వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా, రైతు జీవితంతో విడదీయరాని పండుగ అని అనిత అన్నారు. పాత కష్టాలను వదిలి.. కొత్త ఆశలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ భోగి పండుగ రాష్ట్ర ప్రజలకు మంచి ఫలితాలు తీసుకురావాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తూ పాలన సాగిస్తున్నారని హోం మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సర్వ శుభాలనిచ్చే సంక్రాంతి.. ఆరోగ్యాన్నిచ్చే పిండివంటలు
Read Latest AP News And Telugu News