Share News

Sankranti Cockfighting: గెలుస్తున్న పందెం..

ABN , Publish Date - Jan 14 , 2026 | 07:30 AM

తెల్లవారుజామున కూతతోనే కోడి కత్తి కట్టుకోనుంది. భానుడు వెలుగును ప్రసరించడంతోనే పందేలు మొదలు కానున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందేలతోనే సంక్రాంతి సంబరాలు ఆరంభం కాబోతున్నాయి. ఏటా పోలీసులు పందేలకు, జూద క్రీడలకు..

Sankranti Cockfighting: గెలుస్తున్న పందెం..
Sankranti Cockfighting

  • ఉమ్మడి కృష్ణాలో భారీగా పందేలకు ఏర్పాట్లు

  • శాఖల వారీగా అధికారులకు ముడుపులు

  • అసిస్టెంట్లతో టచ్లో ఉన్న నిర్వాహకులు

  • విజయవాడలో హోటళ్లు హౌస్‌ఫుల్

  • మూడు రోజులు నొ రూమ్

  • నోట్ల కట్టలతో దిగిన ఎన్ఆన్ఐలు!

  • మూడు కేటగిరీల్లో పందేలకు ఏర్పాట్లు

  • గెలుపులో 5-10శాతం నిర్వాహకులకు కమీషన్

  • రామవరప్పాడు, కేసరపల్లి, మీర్జాపురంలో ప్రధాన బరులు

తెల్లవారుజామున కూతతోనే కోడి కత్తి కట్టుకోనుంది. భానుడు వెలుగును ప్రసరించడంతోనే పందేలు మొదలు కానున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందేలతోనే సంక్రాంతి సంబరాలు ఆరంభం కాబోతున్నాయి. ఏటా పోలీసులు పందేలకు, జూద క్రీడలకు ఎలాంటి అనుమతి లేదని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క బరుల ఏర్పాటు పనులు మాత్రం రేయింబవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది గంటల్లో సంక్రాంతి సంబరాలకు అంకురార్పణ జరగనుంది.


విజయవాడ, జనవరి 14: ఉమ్మడి కృష్ణాజిల్లాలో కోడి పందేల కోసం బరులను సిద్ధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట నుంచి కృష్ణాజిల్లా మచిలీపట్నం వరకు పందేలు జోరుగా సాగనున్నాయి. ఎక్కడ ఖాళీ ప్రదేశాలు కనిపిస్తే అక్కడ పుంజులకు కత్తులు కట్టడానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈసారి బరుల వద్ద ఎస్ఆర్ఐల హడావుడి ఎక్కువగా కనిపించబోతుంది. క్రిస్మస్ సెలవులకు విదేశాల నుంచి వచ్చిన వాళ్లంతా సంక్రాంతి సంబరాలను వీక్షించిన తర్వాత వెళ్లాలని ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.


మూడు కేటగిరీలుగా పోటీలు..

అన్ని గ్రామాల్లోనూ కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. రాజకీయ నేతల అండదండలతో భారీ బరులు ఏర్పాటు చేశారు. ఆవుట్ డోర్ బాక్సింగ్ క్రీడను తలపించేలా మినీ స్టేడియాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. విశాలమైన ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన బరులను మూడు కేటగిరీలుగా విభజించారు. చిన్న పందేల కోసం ఒక బరిని, కొంచెం పెద్ద పందాలు కాసే వారికి మరో బరిని కేటాయించారు. ఇక లక్షలాది రూపాయల్లో పందేలు కట్టే వారికి మూడో బరిని సిద్ధం చేశారు.

ఈ బరులను మేజర్, మీడియం, మైనర్ బరులుగా విభజించించారు. రూ.20వేల నుంచి రూ.40వేలు వరకు పందేలు కట్టే వారికి మైనర్ బరిని కేటాయిస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ.2లక్షల వరకు పందేలు పెట్టేవారికి మీడియం బరులను కేటాయిస్తున్నారు. ఇక రూ.10 లక్షల నుంచి రూ.30లక్షలు ఆపై పందేలు కట్టే వారికి మేజర్ బరులను కేటాయిస్తున్నారు. పందేలను వీక్షించడానికి బరుల చుట్టూ కుర్చీలు వేశారు. బరులను మాత్రం కుర్చీలకు రెండు, మూడు అడుగుల ఎత్తులో నిర్మించారు. బరుల చుట్టూ మోకాలి లోతు గొయ్యిని తవ్వారు. పందేలను వీక్షించే వారు బరుల్లోకి అడుగు పెట్టకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కేటగిరీలకు తగినట్టుగానే టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. సందర్శకులు అన్ని బరుల్లోకి వెళ్లకుండా కేవలం పందెం ఏ స్థాయిలో కడతారో దానికి సంబంధించిన టోకెన్ ఇస్తారు. ఈ బరి వద్దకు మాత్రమే సందర్శకులు వెళ్లాలి.


గెలిస్తే కమీషన్ ఇవ్వాల్సిందే!

పుంజు ఎవరిదైనా అనవసరం. పందెం ఎవరు గెలిచినా నిర్వాహకులకు కమీషన్ మాత్రం చెల్లించాలి. కోడి పందేల కోసం బరులను ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఫుడ్‌స్టాల్స్, పార్కింగ్ ప్రదేశాలు, మద్యం విక్రయ స్టాల్‌కు సంబంధించి వేలం పాటలు నిర్వహించారు. అత్యధిక ధరకు పాటను దక్కించుకున్న వారికి ఆ ప్రదేశాలను అప్పగించారు. ఈ విధంగా నోట్ల కట్టలను వెనుకేసుకున్న నిర్వాహకులు.. ఇప్పుడు పందేలపై పడ్డారు. బరిలో దిగిన పుంజు ఎవరిదైనా, పందెం ఎవరు గెలిచినా పది శాతం కమీషన్ మాత్రం నిర్వాహకులకు ముట్టజెప్పాలి. ఒక్కో పందెంపై ఐదు నుంచి పది శాతం కమీషన్‌‌ను తమకు ఇవ్వాల్సిందేనని ముందుగానే స్పష్టం చేశారు.


హోటళ్లు, లాడ్జిలు ఫుల్!

సాధారణంగా కోడిపందేలకు ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా ఉంటాయి. కొన్నాళ్లుగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో కోడిపందేలు సంక్రాంతి సంబరాల్లో భాగమైపోయాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు బరులను భారీ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జరిగే కోడిపందేలను వీక్షించడానికి పొరుగు రాష్ట్రాల నుంచి జనం వస్తుంటారు. ముఖ్యంగా పక్కనే ఉన్న తెలంగాణ నుంచి ఇక్కడికి భారీగా వస్తుంటారు. భోగి నుంచి కనుమ వరకు సాగే సంక్రాంతి సంబరాలను తిలకించడానికి వచ్చే వాళ్లంతా విజయవాడలో వసతిని సమకూర్చుకుంటున్నారు. విజయవాడలో 15 స్టార్ హోటళ్లలో 1200 గదులు అందుబాటులో ఉన్నాయి. చిన్నచిన్న లాడ్జిల్లో 5వేల గదులు ఉన్నాయి. ఈ గదులన్నీ బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి కనుమ రోజు రాత్రి 12 గంటల వరకు ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం నగరంలో లాడ్జిల్లో గదులు లభించడం గగనంగా మారింది.


గుడివాడలో మూడు బరులు

కూటమి నాయకుల ఆధ్వర్యంలో గుడివాడకు కూతవేటు దూరంలో మూడు బరిలను ఏర్పాటు చేశారు. స్థానిక కొత్త బైపాస్ రోడ్డులో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ పాఠశాల వెనుక, గుడివాడ మండలం, టిడ్కో కాలనీ సమీపం బొమ్ములూరులో, రామనపూడిలో లక్షలాది రూపాయల ఖర్చుతో బరులను ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఒక శిబిరంలో కోడిపందేల్లో గెలిస్తే బుల్లెట్ వాహనాన్ని బహుమతిగా ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. ఆయా బరుల్లో జూద శిబిరాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ శిబిరాల్లో మద్యం ఏరులైపారనుంది. మూడు బరిల్లో ఛీప్ లిక్కర్ నుండి ఖరీదైన మద్యం వరకు మద్యంప్రియులకు అందుబాటులో ఉంచుతున్నారు. మద్యం సిండికేట్ భారీస్థాయిలో మద్యాన్ని డంప్ చేయనుంది. బరుల నిర్వాహకులు ఆయా బరుల వద్ద ప్రత్యేకంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. ప్రతి మద్యం బాటిల్ పై రూ.30 నుంచి రూ.50 అధికంగా అమ్మేందుకు సిద్ధమయ్యారు.


క్యారవాన్స్ సందడి

కృష్ణా- ఏలూరు జిల్లాల సరిహద్దున బిళ్లనపల్లి, మీర్జాపురం మధ్య ఏర్పాటు చేస్తున్న టెక్ కోడి పందేలకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వీవీఐపీల కోసం ఏకంగా క్యారవాన్స్‌నే దించుతున్నారు. క్యారవాన్లలో బెడ్, హాలు, బాత్రూమ్ వంటి అత్యాధునిక సదుపాయాలు అనేకం ఉంటాయి. రాజకీయ నాయకులు, ముఖ్య ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా ఎందరో ఈ పోటీలకు రానున్నారు. రూ. కోట్లలో పందేలు కాయనున్నారు. అతిథులకు ఆ స్థాయిలో మర్యాదలు ఇవ్వటం కోసం నిర్వాహకులు రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎక్కువ పందాలు కొట్టేవారికి కార్లు, బైక్లు బహుమతులుగా ఇవ్వనున్నారు.

జిల్లాలో ప్రధాన బరులు..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రధాన బరులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రామవరప్పాడు, కేసరపల్లి, నూజివీడు- బిళ్లనపల్లి సరిహద్దులో తోటల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. కంకిపాడు, ఈడుపుగల్లు, ఉప్పులూరు తదితర చోట్ల బరులు సిద్ధం చేస్తున్నారు.


Also Read:

పల్లెకు సంక్రాంతి.. బంధుమిత్రులతో సందడే సందడి

పురపోరులో సత్తా చాటుతాం

ప్రశ్నించే గొంతుకలను వేధించేందుకే సిట్‌!

Updated Date - Jan 14 , 2026 | 07:30 AM