BJP State President Ramchander Rao: పురపోరులో సత్తా చాటుతాం
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:27 AM
మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని.. గతంలో కన్నా ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని.. గతంలో కన్నా ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికల్లో పొత్తుల్లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని, అయితే ఎవరైనా మద్దతిస్తే స్వాగతిస్తామన్నారు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే తప్పేముందని ప్రశ్నించిన ఆయన.. బీజేపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన ప్రతినిఽధులు తమతో సంప్రదింపులు జరపలేదని చెప్పారు. కవిత కొత్త పార్టీ గురించి తెలియదని, ఆస్తుల పంపకాల సమస్య తీరాక ఆమె పార్టీ పెడతారేమోనని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీలు వారి నివాసాల్లో సమావేశం కావడంలో తప్పేంలేదని, తనకు వ్యతిరేకంగా భేటీ అయ్యారన్న సమాచారం లేదని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బీజేపీ హిందువులతోపాటు, ముస్లిం, సిక్కుల ఓట్లనూ అడుగుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు కేవలం ముస్లింల ఓట్లనే అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తుల ఖాతాల్లో నుంచి ట్రాఫిక్ చలాన్ల డబ్బులు ఆటో డెబిట్ అయ్యే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది చట్టవిరుద్ధ ప్రక్రియ అని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారి విడియోలను బహిర్గతం చేయడం వల్ల అవమానంతో కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయని, ఆ విడియోలు బహిర్గతం చేయొద్దని సూచించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంటున్న ప్రభుత్వం.. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నదీ జలాల అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాయని విమర్శించారు.