వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు: మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:26 AM
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలకు అసూయ ఎక్కువై, కడుపుమంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి, ఎవరూ బతకలేకుండా ఆస్తులు లాక్కున్నారని ఆరోపించారు.
అమరావతి, ఏప్రిల్ 24: మాజీ సీఎం జగన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేని వారిని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరమూ ప్రభుత్వానికి లేదని తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాజకీయం చేయాలనుకుంటే.. ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవుపలికారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలకు అసూయ ఎక్కువై, కడుపుమంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది.. చేసేది తామే అని మంత్రి స్పష్టం చేశారు. ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి, ఎవరూ బతకలేకుండా ఆస్తులు లాక్కున్నారని ఆరోపించారు. విశాఖ వాసుల మంచితనాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారని అన్నారు. రుషికొండను బోడికొండను చేయటంతో పాటు స్టీల్ ప్లాంట్‌ను మూసివేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారాలు, వ్యవహారాలను సర్వనాశనం చేసిన వారు ఇప్పుడు ఉత్తరాంధ్ర మంచి చెడుల గురించి మాట్లాడటానికి సిగ్గుపడాలన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్‌ను తిరిగి ఓపెన్ చేయించామని మంత్రి సంధ్యారాణి అన్నారు. సీఎం చంద్రబాబు, లోకేశ్ కృషితో ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ ఏపీకి వచ్చిందన్నారు. అర్సెల్లార్ మిట్టల్‌తో పాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కడుతున్నాయని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల పండుగను కూటమి ప్రభుత్వం ఉందనే ధైర్యంతో సగర్వంగా జరుపుకుంటోందన్నారు. వైసీపీ హయాంలో పార్టీ మీటింగ్‌లు పెడతారని వీసీలు కూడా భయపడిపోయారని సంధ్యారాణి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: బండి సంజయ్
రైతుపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం
Read Latest AP News And Telugu News