మోదీ పాలనకు 12 ఏళ్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 10:49 AM
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి నేటితో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్న మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అమరావతి, జూన్ 10: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి నేటితో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్న మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కొందరు నాయకులు దేశాన్ని పరిపాలిస్తారని, కొద్దిమంది మాత్రమే దాని గమనాన్ని మారుస్తారని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ 4,399 రోజుల నిరంతర పదవీ కాలంతో భారతదేశాన్ని ప్రతి స్థాయిలో పరివర్తన చేశారని కొనియాడారు. ఆయన భారతదేశానికి అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచారని, ఇది రికార్డు మాత్రమే కాదని ఆయన వ్యాఖ్యానించారు.
నీటి కుళాయి నుంచి చంద్రయాన్ చంద్రుణ్ని చేరడం వరకు, పొలంలో రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దులో సైనికుడి ధైర్యం వరకు ప్రతి రంగంలో దేశ విశ్వాసాన్ని, సామర్థ్యాలను బలోపేతం చేశారని చంద్రబాబు తెలిపారు. ప్రగతి ఫలాలు ప్రతి భారతీయుడికి చేరేలా చేశారని, సంక్షేమం-అభివృద్ధి మధ్య సమతుల్యతను కాపాడారని ప్రశంసించారు. అత్యంత బలహీనులకు మద్దతు అందిస్తూనే అవకాశాలను విస్తరించి, ఆర్థిక పునాదులను బలోపేతం చేసే సంస్కరణలను మోదీ మేళవించారని చెప్పారు. కరుణ, ఆశయం రెండూ కలిసి సాగగలవని ఆయన నిరూపించారని వ్యాఖ్యానించారు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు ఏపీ ప్రజల తరఫున ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. స్వర్ణాంధ్రను నిర్మించడానికి వికసిత్ భారత్ సాకారం కోసం కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
ఈ రికార్డు అనితరసాధ్యం: లోకేశ్
ప్రధానిగా వరుసగా మూడుసార్లు ఎన్నికై, అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మన దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను అధిగమించి మోదీ నెలకొల్పిన ఈ రికార్డు అనితరసాధ్యం. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచంలో అజేయశక్తిగా, సగర్వంగా నిలిపింది. ప్రజలకు అవకాశాలు, గౌరవం కల్పించడం, స్వావలంబన, సాధికారత దిశగా దేశాన్ని నడిపించిన మోదీ సమర్థ నాయకత్వానికి జేజేలు’ అంటూ ఎక్స్‌లో లోకేశ్ కొనియాడారు.
ఇవి కూడా చదవండి...
బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Read Latest AP News And Telugu News