Share News

ఎన్డీయే ఇక.. శక్తిమంతం!

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:08 AM

పార్లమెంటులో అధికార ఎన్డీయే కూటమి మరింత శక్తిమంతం కానుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) తిరుగుబాటు ఎంపీలు 20మంది తమను అధికార ఎన్డీయే కూటమిలో...

ఎన్డీయే ఇక.. శక్తిమంతం!

  • టీఎంసీ రెబల్‌ ఎంపీల మద్దతుతో 313కు పెరగనున్న బలం

న్యూఢిల్లీ, జూన్‌ 9: పార్లమెంటులో అధికార ఎన్డీయే కూటమి మరింత శక్తిమంతం కానుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) తిరుగుబాటు ఎంపీలు 20మంది తమను అధికార ఎన్డీయే కూటమిలో ప్రత్యేక సమూహంగా గుర్తించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ సమర్పించారు. మరోవైపు టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్‌రాయ్‌ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలు.. ఉభయ సభల్లోనూ ఎన్డీయేకు బలాన్ని పెంచడంతోపాటు కీలక బిల్లులను సులభంగా ఆమోదించేందుకు మార్గం సుగమం చేయనున్నాయి. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు కకోలీ ఘోష్‌ దస్తీదార్‌ నాయకత్వం వహించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, టీఎంసీలో చీలికకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే కారణమని దస్తీదార్‌ తెలిపారు. ‘‘బెంగాల్‌ ప్రజలు ఇచ్చిన తీర్పును మేం శిరసావహిస్తున్నాం. ఎన్డీయేతో కలిసి ముందుకు సాగితేనే మా రాజకీయ భవితవ్యం ఉంటుందని విశ్వసిస్తున్నాం.’’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకుగాను ఎన్డీయేకు ప్రస్తుతం 293 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా టీఎంసీ నుంచి 20 మంది ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన దరిమిలా అధికార కూటమి బలం 313కు చేరుతుంది.

బీజేపీ చీలికలు సృష్టించదు

టీఎంసీ తిరుగుబాటు ఎంపీల వ్యవహారంపై బీజేపీ సీనియర్‌ నేత ఒకరు మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ చీలికలు సృష్టించదని తెలిపారు. జాతీయ ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ మాకు(బీజేపీ) ఎవరు మద్దతు ప్రకటించినా ఆహ్వానిస్తామన్నారు. ఎన్డీయేకు మద్దతు ఇస్తామంటూ డీఎంకే నుంచి కూడా సంకేతాలు వచ్చినట్టు తెలిపారు. డీఎంకేకు లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్నారు.

ఆమోదం.. నల్లేరుపై నడకే!

పార్లమెంటు ఉభయ సభల్లోనూ అధికార ఎన్డీయే కూటమికి మద్దతు పెరుగుతున్న దరిమిలా రాజకీయంగా సునిశితమైన, రాజ్యాంగ పరంగా ప్రాముఖ్యం ఉన్న బిల్లుల ఆమోదం నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతోపాటు 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లులు గత సభలో వీగిపోగా.. ఈ దఫా వాటిని అధికార పక్షం సునాయాసంగా ఆమోదించుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, లోక్‌సభలో టీఎంసీ చీఫ్‌వి్‌పగా ఎంపీ కల్యాణ్‌ బెనర్జీని ఎంపిక చేసినట్టు మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ మేరకు స్పీకర్‌ ఓం బిర్లాకు ఆమె లేఖ రాశారు. టీఎంసీ రెబెల్‌ ఎంపీ కకోలీ ఘోష్‌ స్పీకర్‌ బిర్లాకు లేఖ రాసిన నేపథ్యంలో మమత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతాబెనర్జీ మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో ఉన్న సోనియా నివాసానికి వెళ్లిన మమత పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఇండీ కూటమిని మరింత బలోపేతం చేసే విషయంపై ఆమె చర్చించారని తెలిసింది.

Updated Date - Jun 10 , 2026 | 04:08 AM