Share News

పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం చంద్రబాబు సీరియస్

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:39 PM

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, తాగునీటి పైప్‌లైన్‌కు నష్టం కలిగించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం చంద్రబాబు సీరియస్
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 25: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, తాగునీటి పైప్‌లైన్‌కు నష్టం కలిగించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించిన సీఎం.. తక్షణమే పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా అధికారులను సీఎంఓ కార్యాలయం సమగ్ర నివేదిక కోరింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు ప్రజల అవసరాలకు ఉద్దేశించిన తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని సీఎంవో స్పష్టం చేసింది.


ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా, అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఎవరినీ ఉపేక్షించవద్దని జిల్లా కలెక్టర్‌కు సీఎంఓ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలపై స్పందించిన కడప జిల్లా కలెక్టర్.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సీఎంవోకు నివేదిక సమర్పించారు. ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లి వద్ద ఇసుక తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించారని కలెక్టర్ తెలిపారు. తక్షణమే రంగంలోకి దిగిన అధికారులు అక్రమ తవ్వకాలను, ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేశారని వివరించారు.


ఈ అక్రమ రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్లు, వాటి యజమానులు, ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వ్యక్తుల వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేసిన నిందితులు, ట్రాక్టర్ యజమానులపై కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేశామన్నారు. దెబ్బతిన్న పైప్‌లైన్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టినట్లు నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. పెన్నా, చిత్రావతి నదీ తీరాల్లో అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక చెక్‌పోస్టులు, జిల్లా-మండల స్థాయి కమిటీల ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఉప్పాడ మత్స్యకారుల కోసం పారాదీప్ సముద్ర జలాల్లో గాలింపు

సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమం: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 01:45 PM