తెలంగాణ విభజనకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:30 PM
జనసేన ప్రస్థానం - జాతీయ సమగ్రత కోసం ప్రత్యేక సమావేశం ఢిల్లీ వేదికగా ప్రారంభమైంది. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తైందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని గుర్తుచేసుకున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 15: జనసేన ప్రస్థానం- జాతీయ సమగ్రత కోసం ప్రత్యేక సమావేశం ఢిల్లీ వేదికగా ప్రారంభమైంది. వందేమాతర గీతాలాపన అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభోపన్యాసం చేశారు. జాతీయ సమైక్యతపై జనసేనాని దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తైందని తెలిపారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని గుర్తుచేసుకున్నారు. అధికారంలోకి రావాలన్న ఆశతో పార్టీ పెట్టలేదని.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ బాగుపడాలంటే.. దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ మనుగడ కోసం కొన్ని పార్టీలు దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని తెలిపారు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదని పవన్ వెల్లడించారు. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరుపైనే ఆవేదన వెలిబుచ్చామని వివరించారు. తెలంగాణ విభజనకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదన్నారు. కాంగ్రెస్ విభజించిన తీరు.. అసంతృప్తి, అశాంతిని సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆస్తుల పంపిణీ, తదితర సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఢిల్లీ మెడలు వంచుతామని చాలా మంది మాట్లాడుతున్నారని.. కానీ ఢిల్లీకి రాగానే ఎవరి నోర్లు పెగలవని దుయ్యట్టారు. దేశ రక్షణకు, భద్రతకు ప్రధాన కేంద్రం ఢిల్లీ అని తెలిపారు. స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు ఈ గడ్డ నిలయమన్నారు. రాజ్యాంగం పుట్టిన చోటు కాబట్టే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల కీలక నాయకులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లు వద్దనే భావనను తొలగించేలా కసరత్తు: మంత్రి పొన్నం ప్రభాకర్
మోదీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతోంది: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News