అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:57 PM
పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారికే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, 83 శాతం మంది కొత్తవారికి పార్లమెంటరీ కమిటీల్లో చోటు కల్పించామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
అమరావతి, జనవరి 27: టీడీపీలో కార్యకర్తలే అధినేతలుగా ఉంటారని, పార్టీలో యువతకు తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. మహిళలను గౌరవించాలని, 33 శాతం పదవులు వారికి కేటాయించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోందన్నారు మంత్రి. రైతులకు ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారికే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, 83 శాతం మంది కొత్తవారికి పార్లమెంటరీ కమిటీల్లో చోటు కల్పించామని మంత్రి వెల్లడించారు. పార్టీనే అందరికీ అధినాయకత్వం అని పేర్కొన్న లోకేష్.. సేనాధిపతి చంద్రబాబుకి తామందరం సైనికులమని చెప్పుకొచ్చారు. మడమ తిప్పటం, మాట మార్చటం తెలుగుదేశం రక్తంలోనే లేదన్నారు. చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు తీసుకురావాలని, గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో స్థాయికి చేరేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు యువతకు ప్రాధాన్యత అవసరమని చెప్పుకొచ్చారు. జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి లోకేశ్ వివరించారు.
ఇవి కూడా చదవండి..
యువగళానికి మూడేళ్లు.. లోకేశ్‌కు పలువురు నేతల శుభాకాంక్షలు
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
Read Latest AP News And Telugu News