Share News

వైసీపీ ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి పయ్యావుల కేశవ్

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:02 PM

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు.

వైసీపీ ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి పయ్యావుల కేశవ్
Minister Payyavula Keshav

అమరావతి, జనవరి 31: టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి క్లీన్ చిట్ రాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) స్పష్టం చేశారు. వైసీపీ తమకు క్లీన్ చిట్ వచ్చినట్లు చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, దేవదేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవడానికి ఆ పార్టీ నేతలకు సిగ్గుండాలని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం స్వామివారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు అనేక పకడ్బందీ నిబంధనలు పెట్టిందని.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిబంధనలను సడలించి కల్తీకి బీజం వేసిందని అన్నారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2022లో సీఎఫ్‌టీఆర్‌ఐ(సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) నెయ్యి పేరిట సరఫరా అయిన పదార్థాల్లో జంతు అవశేషాలు ఉన్నాయని నిర్ధారించిందని.. ఆ నివేదికను నాటి వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి విమర్శించారు. దేవుడి ప్రసాదానికి ముడిసరకు పంపిణీని ఆర్థిక అంశంగా మాత్రమే గత పాలకులు చూశారన్నారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నకు హవాలా మార్గంలో వచ్చిన డబ్బు ఎవరెవరికి వెళ్లిందో తేలాల్సి ఉందన్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ల్యాబ్ అయిన ఎన్‌డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) జంతు అవశేషాలు ఉన్నాయని నిర్ధారణ చేసిన అంశాన్నే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారని.. ఇదే విషయం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అనుబంధ ఛార్జ్ షీట్ 35వ పేజీలో స్పష్టంగా ఉందని మంత్రి వివరించారు.


వైసీపీ చెబుతున్నట్లుగా క్లీన్ చిట్ ఎక్కడ వచ్చిందో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. చేసిన తప్పుకు క్షమాపణలు కోరాల్సింది పోయి, తప్పే జరగనట్లు ప్రజలను మోసం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. జరుగుతున్న విపరీత ప్రచారాలు చూసి తట్టుకోలేకే వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నామే తప్ప.. తిరుమల శ్రీవారి విషయంలో రాజకీయం చేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

విషాదం.. రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 02:04 PM