Share News

హృదయపూర్వక అభినంద‌న‌లు చిట్టిత‌ల్లులు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:53 AM

తిరుపతి జిల్లాలోని వెంకటగిరి జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్ విద్యార్థుల నిజాయితీ అభినందనీయమని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు.

హృదయపూర్వక అభినంద‌న‌లు చిట్టిత‌ల్లులు: మంత్రి లోకేశ్
Minister Nara Lokesh

అమరావతి, మార్చి 6: తిరుపతి జిల్లాలోని వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినుల నిజాయితీని కొనియాడారు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh). చిన్న వయస్సులోనే విద్యార్థినిల నీతివంతమైన ప్రవర్తన ఆదర్శనీయమని ప్రశంసించారు. విద్యార్థినిల నిజాయితీ విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసిందన్నారు. ‘నిజాయితీలో మా పిల్లలు బంగారం’ అని మంత్రి లోకేశ్ అన్నారు.


అసలేం జరిగిందంటే.

తిరుప‌తి జిల్లా వెంక‌ట‌గిరి జెడ్పీ గ‌ర్ల్స్ హైస్కూల్‌లో చ‌దువుతున్న విద్యార్థినిలు తమ నిజాయితీతో ఆదర్శంగా నిలిచారు. నిన్న(గురువారం) సాయంత్రం స్కూలు ముగిసిన తర్వాత వెంకటగిరి ఎస్‌బీఐ బ్యాంకు వద్ద మన్నవరం బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో విద్యార్థినిలకు ఒక పర్సు కనిపించింది. ఆ పర్సులో బంగారు నగలు, నగదు ఉన్నాయి. ఎటువంటి ఆలోచన లేకుండా 8వ తరగతి విద్యార్థినిలు బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక, 6వ తరగతి చదువుతున్న పద్మశ్రీ, 7వ తరగతి విద్యార్థిని హేమలతలు వెంటనే పర్స్‌ను తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ స్వరూపకు అందజేశారు.


పోలీసుల నుంచి అభినందనలు అందుకున్న తర్వాత విద్యార్థినిలు బస్ స్టాప్ వద్దకు వచ్చారు. అక్కడ ఓ మహిళ ఆ పర్సు వెతుకుతూ పిల్లలను అడిగింది. విద్యార్థినిలు తమకే దొరికిందని.. పోలీస్ స్టేషన్‌లో ఇచ్చేశామని చెప్పి ఆమెతో పాటు మళ్లీ స్టేషన్‌కు వెళ్లారు. ఎస్‌ఐ ఆ మహిళ వివరాలు తెలుసుకుని... పర్సులోని నగలు, నగదు ఆమెవేనని నిర్ధారించుకుని అందజేశారు.

tirupati-students.jpg


మంత్రి స్పందన...

ఈ సంఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. ‘నిజాయితీలో మా పిల్లలు బంగారం’ అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిజాయితీ, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. ‘చిన్న వయసులోనే మీ నీతివంతమైన ప్రవర్తన ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలూ. మీకు ఎల్లప్పుడూ అండగా ఉండే అన్నగా నేను గర్విస్తున్నాను. మీ నిజాయితీ మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. హృదయపూర్వక అభినందనలు చిట్టితల్లులూ’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

‘మీకు రోజూ అలవాటుగా మారింది’.. వైసీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం

బొత్స ఆరోగ్యంగా హౌస్‌కు రావడం సంతోషకరం: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 12:13 PM