కుట్రతోనే తెరపైకి మావిగన్ పేరు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:43 PM
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, అందరినీ సంప్రందించి అమరావతిని నిర్ణయించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతికి జగన్ కూడా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.
అమరావతి, ఏప్రిల్ 4: వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై వైసీపీకి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఇది ఒక ఇంటి వ్యవహారం కాదని.. చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అందరినీ సంప్రదించి అమరావతిని నిర్ణయించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విడదీసిన సమయంలో కాంగ్రెస్ నేతలు అందరూ ఉన్నారని.. ఇప్పుడు వారంతా వైసీపీలో ఉన్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారని చెప్పారు. ఆ రోజు ఫలానా ప్రాంతం రాజధాని అని ఎందుకు నిర్ణయించలేదని మంత్రి ప్రశ్నించారు.
2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గెలిపించారని మంత్రి తెలిపారు. అమరావతి నిర్ణయానికి ఆ రోజు అందరూ కలిసి మద్దతు ఇచ్చారని.. జగన్ మోహన్ రెడ్డి కూడా సమర్థించారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రజలు ఒక్క ఛాన్స్ అని జగన్‌కు మద్దతు ఇచ్చారని మంత్రి అన్నారు. కానీ జగన్ ఎలా వ్యవహరించారో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. రాజధానిపై కక్ష కట్టి నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతిని స్మశానం, ఎడారి అని అన్నారని.. కులం రంగు పూసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అధికారం కోసం దేనికైనా తెగిస్తారని మంత్రి వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల పేరు చెప్పి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని మంత్రి ఆరోపించారు. ఒక్క అమరావతే కాదని.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేసే ప్రణాళిక చంద్రబాబు రూపొందించారని వివరించారు. జగన్‌కు విశ్వసనీయత ఎక్కడుందని ప్రశ్నించారు. రాజధాని అంశంపై తొమ్మిది సార్లు మాట మార్చిన జగన్‌కు విశ్వసనీయత ఎక్కడుందన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లును సమర్థించగా వైసీపీ మాత్రం వాకౌట్ చేసిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.
వైసీపీ నేతలకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని మంత్రి ప్రశ్నించారు. కుట్రతోనే జగన్ మావిగన్ పేరు తీసుకొచ్చి అమరావతి ఆనందాన్ని డైవర్ట్ చేయాలని చూశారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి తిరగబడాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి చంద్రబాబు ఏమీ చేయలేరని జగన్ అనుకున్నారని తెలిపారు. రాజధాని ఒక్కరోజులో అయ్యేది కాదని.. నిరంతరం అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. హైదరాబాద్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నట్లే అమరావతి కూడా అలానే అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు వివరించారన్నారు. మావిగన్‌పై జగన్ తన నాయకులను పిలిపించి అడిగితే అసలు రంగు బయటపడుతుందన్నారు. 2019లో చేసిన తప్పు మళ్లీ చేయమని, ఈ సారి చేసిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి
రాజధాని పనులు.. వారంతా చరిత్రలో భాగస్వాములే: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News