రాజధాని పనులు.. వారంతా చరిత్రలో భాగస్వాములే: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:21 PM
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణాన్ని కేవలం కాంట్రాక్ట్ వర్క్‌గా చూడొద్దని.. ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములవుతారని సీఎం అన్నారు.
అమరావతి, ఏప్రిల్ 4: రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ స్థలంలో సుమారు 20 వేల మంది కార్మికులు, నిపుణులు పని చేస్తున్నారు. ప్రతి నిర్మాణ సంస్థ ఎంత మేరకు పనులు పూర్తి చేసింది, టార్గెట్లను ఎంతవరకు సాధించింది అనే విషయాలపై పనుల వారీగా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. కార్మికుల సంఖ్య, యంత్రాల వినియోగం వంటి అంశాలపై కూడా సమగ్ర చర్చ చేపట్టారు. వారం, నెలవారీ టార్గెట్‌లు నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని అధికారులు, సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. వర్షాకాలం ముందు పూర్తి చేయాల్సిన పనులపై అధికారులు తమ లక్ష్యాలను సీఎంకు వివరించారు.
ఈ అవకాశం అందరికీ దక్కదు: సీఎం చంద్రబాబు
రాజధాని నిర్మాణాన్ని కేవలం కాంట్రాక్ట్ వర్క్‌గా చూడొద్దని.. ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములవుతున్నట్టే అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నిర్మాణ సంస్థలుగా మీరు ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు... కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది మీరే. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి... కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి. రాజధాని ప్రతిష్ఠను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందే. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. మ్యాన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేపట్టిన వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో వివిధ దశల్లో రూ.57,821 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎల్‌పీఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనుల సంబంధిత వివాదాలు, సమస్యలను పరిష్కరించి సీఆర్డీఏ మళ్లీ పనులను చేపట్టింది. నాటికి నేటికి నిర్మాణ వ్యయం పెరగడం వంటి సవాళ్లను అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులను అప్పగించింది సీఆర్డీఏ.
ఇవి కూడా చదవండి...
దారుణం... వివాహితపై ఇంటి యజమాని వికృత చేష్టలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి
Read Latest AP News And Telugu News