స్థానిక ఎన్నికల్లో వంద శాతం గెలుపే లక్ష్యం.. నేతలకు నాదెండ్ల దిశానిర్దేశం
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:01 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని నేతలకు మంత్రి నాదెండ్ల మనోహన్ పిలుపునిచ్చారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి నేరుగా జరుగుతాయని వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబర్ 9: స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని నేతలకు మంత్రి నాదెండ్ల మనోహన్ పిలుపునిచ్చారు. ఈరోజు(బుధవారం) జనసేన స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తామని.. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి నేరుగా జరుగుతాయని వెల్లడించారు. గతంలో మాదిరిగా అందరూ కలిసి ఒకరిని ఎన్నుకునే విధానానికి స్వస్తి పలికినట్లు తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చామన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ జనసేనాని పవన్ కల్యాణ్ ‘మీ కష్టాలు, మీ పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు’ అని తెలిపారు.
బలమున్న ప్రాంతలను గుర్తించండి...
జనసైనికుల సంక్షేమం కోసం తొలుత రూ.ఐదు కోట్లతో ఇన్సూరెన్స్‌ను ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కౌలు రైతులు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారని.. ఆ సమయంలో పవన్ తన సొంత డబ్బును ఆర్థిక సాయంగా అందించారని చెప్పారు. నిజాయితీకి మారు పేరుగా ఉన్న పవన్ కల్యాణ్ సారధ్యంలో అందరం పని చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వంద శాతం ఫలితాలు సాధించాలని నేతలకు తెలిపారు. పంతాలకు పోకుండా జనసేనకు బలమున్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. పార్టీ సభ్యత్వంలో కీలకంగా పని చేసిన వారికి, పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ‘భవిష్యత్తులో మీరే మేయర్లు, ఛైర్మన్‌లు, వార్డు సభ్యులుగా గెలుస్తారు. కానీ పార్టీ ఆదేశాలను పాటించేలా క్రమశిక్షణ ఉండాలి. అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా చెప్పండి. ఒకేసారి అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. పార్టీ ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి’ అని నిర్దేశించారు.
యలమంచిలి, నర్సీపట్నంలో జనసేనకు పట్టు..
ఈనెల 15న మంగళగిరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహంపై సమీక్ష చేస్తారన్నారు. జనసేన కూటమిలో భాగస్వామ్యంతో ప్రభుత్వంలో ఉన్నామని గుర్తించాలని చెప్పారు. 12న, 15న కూటమి పక్షాల సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతాయని.. ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో తొలివిడత ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ప్రతి ఓటు చాలా ముఖ్యమని... ప్రతి గడపకూ వెళ్లాలని ఆదేశించారు. జనసేన సభ్యత్వం ఉన్న వ్యక్తులే అభ్యర్థులుగా ఉండాలన్నారు. హింసను ప్రేరేపించే విధంగా రక్తం ప్రవహిస్తుందని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏకగ్రీవంపై జగన్.. వాళ్ల పార్టీ వారినే బెదిరిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. పార్లమెంటు పరిధిలో ఉన్న నేతలు ముందుగానే సమావేశం పెట్టుకుని చర్చించుకుని ప్రశాంతంగా ముందుకు సాగాలని సూచించారు. వంద శాతం విజయమే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలన్నారు. యలమంచిలి, నర్సీపట్నంలో జనసేనకు పట్టు ఉందని.. కాకినాడ పార్లమెంటులో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది’ అంటూ లోకేశ్ పోస్ట్
పల్లెటూరిలో పుట్టా.. పదవులే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి: వెంకయ్య నాయుడు
Read Latest AP News And Telugu News