మహా పూర్ణాహుతితో ముగియనున్న ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు: ఈవో శీనా నాయక్
ABN , Publish Date - Oct 19 , 2026 | 07:42 PM
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో శీనా నాయక్ వెల్లడించారు.
విజయవాడ, అక్టోబర్ 19: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో శీనా నాయక్ వెల్లడించారు. సోమవారం అమ్మవారు మహిషాసుర మర్ధిని అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారని తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య మహా పూర్ణాహుతితో ఈ ఉత్సవాల ముగిస్తాయని వివరించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే ఈ మహా పూర్ణాహుతి ఉంటుందని స్పష్టం చేశారు.
సోమవారం విజయవాడలో స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, దుర్గ గుడి పాలక మండలి బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో కలిసి ఈవో శీనా నాయక్ మాట్లాడారు. దుర్గమ్మ వారు మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు. సాయంత్రం కృష్ణానదిలో హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఈ తెప్పోత్సవానికి బోట్ల నిర్వహణపై ట్రయల్స్ అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
భవానీ దీక్షల విరమణల నేపథ్యంలో బుధవారం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగనుందని వివరించారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా ఈ దసరా ఉత్సవాలు నిర్వహించామని ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు.
ఇక నవ రాత్రుల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దుర్గమ్మ వారిని సుమారు 13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. అమ్మవారి భక్తులకు 22 లక్షల లడ్డూ ప్రసాదాల పంపిణీ చేశామని అన్నారు. 6.29 లక్షల మందికి అన్నప్రసాదం, 37 లక్షల వాటర్ బాటిళ్లు, 2.68 లక్షల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేశామని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో 8 లక్షల లడ్డూ నిల్వలు ఉన్నాయని ఈవో శీనా నాయక్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి: సీఎం చంద్రబాబు
నేహాబోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు
For More AP News And Telugu News