Share News

గోదావరి నదిలో ఐదుగురి మృతిపై సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:12 PM

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గోదావరి నదిలో ఐదుగురి మృతిపై సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
Godavari River tragedy

అమరావతి, జులై 18: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడటం తీవ్ర విచారకరమని సీఎం అన్నారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గొమ్ముకొత్తగూడెంకు చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్‌ అనే ఐదుగురు చేపలవేటకు వెళ్లి మరణించినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని.. అవసరమైన సహాయ సహకారాలు తక్షణమే అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.


ఐదుగురి మృతిపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

పోలవరం జిల్లా ఏటపాక మండల పరిధిలోని గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలవరం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.


సమగ్ర దర్యాప్తు చేపట్టాలి.. హోంమంత్రి ఆదేశం

పోలవరం జిల్లా ఎటపాక మండలంలో గోదావరి నదిలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతిచెందిన ఐదుగురి కుటుంబాలకు హోంమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు.. కాశీబుగ్గ పోలీసులపై చర్యలు

భారత్ మరిన్ని విజయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 04:28 PM