Share News

పేర్ని నాని, కిట్టుకి పోలీసు అధికారుల సంఘం వార్నింగ్

ABN , Publish Date - Apr 02 , 2026 | 08:33 PM

బందరులోని స్థానిక పోలీసుల పట్ల మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది.

పేర్ని నాని, కిట్టుకి పోలీసు అధికారుల సంఘం వార్నింగ్

మచిలీపట్నం, ఏప్రిల్ 02: బందరులోని స్థానిక పోలీసుల పట్ల మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. వీరి వ్యాఖ్యలను జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జైపాల్ ఖండించారు. గురువారం బందరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జైపాల్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖను బెదిరిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేలా పేర్ని నాని, కిట్టు వ్యాఖ్యలతోపాటు చర్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు.


మచిలీపట్నంలో అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు స్థానిక సీఐపై దురుసుగా, అమర్యాదగా మాట్లాడిన మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ శాఖ ఎవరి ఒత్తిళ్లకు లొంగి పని చేయదన్న విషయాన్ని ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన పేర్ని నాని తెలుసుకుంటే బాగుంటుందన్నారు. పోలీసులపై ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని చేయాల్సి ఉందంటూ వారికి జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జైపాల్ సూచించారు.


అక్రమ కట్టడం కూల్చి వేసే సమయంలో మున్సిపల్ కమిషనర్ రాతపూర్వకంగా భద్రత కల్పించాలని పోలీసులను కోరారని వివరించారు. అందులో భాగంగానే అక్కడ శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారన్నారు. బందోబస్తులో భాగంగా విధుల్లో ఉన్న ఇనగుదురుపేట సీఐ పట్ల పేర్ని కిట్టు అగౌరవంగా మాట్లాడారని పేర్కొన్నారు. కిట్టు చర్యలు, వ్యాఖ్యలను ఖండించాల్సిన ఆయన తండ్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి సీఐపై అవమానీయంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.


మీ కార్యకర్తలను సంతోష పరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. గత రెండేళ్లుగా పోలీసులను లక్ష్యంగా చేసుకుని మీరు చేసే వ్యాఖ్యలు ఎంత వరకు సమర్థనీయమని మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టును జైపాల్ ప్రశ్నించారు. పోలీసులపై ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్ని నాని, కిట్టుకు జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి

రాజధానికి పట్టిన గ్రహణం వీడింది: మంత్రి లోకేశ్

For More AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 08:38 PM