పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:09 PM
పార్లమెంట్ ఉభయ సభల్లో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడంపై తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు గురువారం స్పందించారు.
అమరావతి, ఏప్రిల్ 02: పార్లమెంట్ ఉభయ సభల్లో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడంపై తన ఎక్స్ ఖాతా వేదికగా గురువారం సీఎం చంద్రబాబు స్పందించారు. పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకం అని ఆయన అభివర్ణించారు.
ఈ బిల్లు ద్వారా ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని.. అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణమని ఏపీ సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి ప్రస్థానంలో ప్రతీ అడుగులో ప్రధాని మోదీ అండగా నిలిచారన్నారు.
2015లో రాజధానికి శంకుస్థాపన.. 2025లో పునర్నిర్మాణం... ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరిగిందని ఈ సందర్భంగా ఏపీ సీఎం గుర్తు చేసుకున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు హోం శాఖ మంత్రి అమిత్ షా పూర్తిగా సహకరించారని వివరించారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం అమరావతి రైతులకు అంకితం ఇస్తున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించారు.
రాజధాని కోసం వారు చేసిన త్యాగం, చూపిన పట్టుదల మరువలేనివి అంటూ రైతులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. అమరావతి ఇక ఆంధ్రులకు ఏకైక ప్రజా రాజధాని అని స్పష్టం చేశారు. రాజధానిపై ఇక ఎలాంటి అనుమానాలకు, చర్చలకు తావు లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొన్న చీకటి రోజులకు ఇది ముగింపు అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఏపీ ప్రగతికి ఈ నిర్ణయం కొత్త నాంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్‌స్టాపబుల్ అని ఆయన చమత్కరించారు. దేశానికే అద్వితీయమైన భవిష్యత్ నగరంగా అమరావతి నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి సుస్థిరతతో నూతన శకం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చేనేత కార్మికులకు ఆర్డర్లు రద్దు చేయడంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం..
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు
For More AP News And Telugu News