ఏపీ లిక్కర్ స్కామ్.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:33 AM
ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
అమరావతి, జూన్ 11: ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచి సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున హవాలాతో పాటు, మనీలాండరింగ్ ద్వారా నిధులు మళ్లించినట్లు గుర్తించిన అధికారులు.. పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో హైదరాబాద్, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
ఈ కేసులో పలు కంపెనీలతో పాటు కార్పొరేట్ కార్యాలయాల్లోనూ గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో లభించిన సమాచారం, గతంలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో కూడా గతంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో పెద్దఎత్తున పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ ప్రణాళికలు, ఎవరెవరు లబ్ధి పొందారనే దానిపై ఈడీ అధికారులు సమాచారం సేకరించారని.. దాని ఆధారంగా హైదరాబాద్‌లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం.. ఆరుగురి అరెస్ట్
Read Latest AP News And Telugu News And Telangana News