Share News

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు.. టెక్ దిగ్గజాలతో ఒప్పందాలు..

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:48 PM

ఢిల్లీలోని ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదర్చుకుంది..

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు.. టెక్ దిగ్గజాలతో ఒప్పందాలు..
CM Chandrababu

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటమ్ - ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.


ఏపీలో క్వాంటమ్ - ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌళిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా ఏడు ఒప్పందాలు కుదర్చుకుంది సర్కార్. ఏపీని క్వాంటమ్ - ఏఐ హబ్‌గా తీర్చిదిద్దడం... అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ - క్వాంటమ్ రంగాల్లో శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఏఐ - క్వాంటమ్ వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.


ఏడు ఒప్పందాలు ఇవే...

ఎంఓయూ-1

క్వాంటమ్, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది.

  • అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటమ్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ.

  • ఏఐ - క్వాంటమ్ డిజిటల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను తీర్చిదిద్దేలా ప్రణాళికలు.

  • రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం కార్యక్రమానికి యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్ సహా ఆ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.


ఎంఓయూ-2

క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.

  • ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌‌ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేలా ఐబీఎం ఎంఓయూ.

  • భారత్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్‌వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణ కార్యక్రమం.

  • ఈ ఒప్పందం కార్యక్రమానికి ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఆ సంస్థ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీ, ఐబీఎం రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ తదితరులు హాజరయ్యారు.


ఎంఓయూ-3

ఏపీలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (NIELIT)తో ఒప్పందం కుదిరింది.

  • దక్షిణ భారత్‌లో మొట్టమొదటి ఏఐ, క్వాంటమ్ డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రణాళిక.

  • కేంద్రం నుంచి మౌలిక సదుపాయాలకు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి, క్వాంటం హార్డ్‌వేర్ సమకూర్చేలా ఒప్పందం.

  • అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నేషనల్ హబ్‌గా తీర్చిదిద్దేలా కార్యాచరణ

  • ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో NIELIT డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి, కంట్రోలర్ జనరల్ డాక్టర్ అలోక్ త్రిపాఠి తదితరులు ఒప్పందం చేసుకున్నారు.


ఎంఓయూ-4

రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

  • ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతో పాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్‌ఫామ్ ఏర్పాటుపై ఎంఓయూ.

  • ఒప్పంద కార్యక్రమంలో భారత్ జెన్ సీఈఓ హృషికేష్ మోహల్ బాల్, ప్రతినిధి రామకృష్ణన్‌లు నెక్స్ జెన్ సీఈఓ రాజగోపాల్, ఐబీఎం రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ పాల్గొన్నారు.


ఎంఓయూ-5

ఏపీలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు ఏపీతో కాలిబో ఏఐ సంస్థ ఒప్పందం చేసుకుంది.

  • గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులకు అవగాహన, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్ - ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేలా ఎంఓయూ.

  • ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై దృష్టి సారించేలా ఎంఓయూ.

  • ఈ ఎంఓయూలో రాజ్ వట్టికూటి, అరబిందో సాహూ, విపుల్ వలంజీ, పింటో జోయ్సన్, జోహన్నెస్ ష్రోడర్ తదితరులు పాల్గొన్నారు.


ఎంఓయూ-6

అమరావతి క్వాంటమ్ వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో వైజర్ సంస్థ ఒప్పందం చేసుకుంది.

  • ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ - క్వాంటమ్ లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేసేలా వైజర్ సంస్థ ఒప్పందం.

  • ఈ ఎంఓయూలో క్వాంటం సొల్యూషన్స్ హెడ్ వర్ధన్ సెహగల్, రాజ్ వట్టికూటి బృందం పాల్గొన్నారు.


ఎంఓయూ-7

ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఎంఓయూ.

  • ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, ప్రొఫెసర్ మితేష్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

అమరావతిలో పోలీసుల క్రికెట్ పోటీలు.. పాల్గొన్న హోం మంత్రి అనిత

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 02:56 PM